
విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలి
గార్ల: సాధించాలనే పట్టుదల, సంకల్పం, సరైన ప్రణాళిక, శారీరక సుఖాలను త్యాగం చేసే గుణం, ఆచరించేతత్వం ఉంటే అమ్మాయిలు అద్భుత ఫలాలను పొందవచ్చని జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి సూచించారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలికల చట్టాలపై గార్ల కస్తూర్బాగాంధీ పాఠశాలలో ఆమె విద్యార్థినులకు అవగాహన కల్పించారు. తొలుత గార్లలో కమ్యూనిటీ మీడియేషన్ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. లక్ష్యం మాత్రమే ఉంటే సరిపోదని తగిన శ్రమ అవసరమని అన్నారు. 18 సంవత్సరాల వయస్సు లోపల ఉన్న బాలికలపై అసభ్యంగా ప్రవర్తిస్తే పోక్సో చట్టం కఠినంగా శిక్షిస్తుందన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ద్వా రా శిక్షణ పొందిన కమ్యూనిటీ మీడియేటర్లు తమ వద్దకు వచ్చిన కమ్యూనిటీ వివాదాలను పరిష్కరించడంలో చురుకై న పాత్ర పోషించాలని కోరారు. ఈ రోజుల్లో జనాభా పెరిగిన నిష్పత్తిలో కోర్టుల సంఖ్య పెరగకపోవడంతో, ప్రత్యామ్నాయ పద్ధతుల్లో కేసులను పరిష్కరించడానికి కమ్యూనిటీ మీడియేషన్ కేంద్రాలు స్థాపిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా కేంద్రాలను ఓపెన్ చేశామని అవి విజయవంతంగా నడుస్తున్నందున, జిల్లాలో తొలిసారి గార్లలో ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ శారద, ఎంపీడీఓ మంగమ్మ, ఎస్సై రియాజ్‌పాషా, లాయర్లు జంపాల విశ్వ, కృష్ణారెడ్డి, కమ్యూనిటీ మీడియేటర్స్ అలువాల రామకృష్ణ, గిన్నారపు మురళి, పుట్టల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. గార్ల మండలం మర్రిగూడెం వేట వెంకటేశ్వరస్వామిని శనివారం జిల్లా జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి దర్శించుకున్నారు. జడ్జి వెంట ఆలయం ఈఓ సంజీవరెడ్డి, ఎస్సై రియాజ్‌పాషా, కుటుంబరావు ఉన్నారు.
జిల్లా జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి
గార్లలో తొలి కమ్యూనిటీ మీడియేషన్
కేంద్రం ప్రారంభం