
ఉద్యోగ భద్రతేది?
● వేతనాలు రాక గిరిజన ఆశ్రమ పాఠశాలల కార్మికుల సమ్మె
● రెగ్యులరైజ్ చేయాలని, టైంస్కేల్
చెల్లించాలని డిమాండ్
● జిల్లా వ్యాప్తంగా 197మంది విధులు
మహబూబాబాద్ అర్బన్: గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో వంట, పారిశుద్ధ్య పనులు చేస్తున్న డైలీ వేజ్ వర్కర్ల బతుకుల్లో మార్పు రావడం లేదు. సరిగా వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే సమాన పనికి సమాన వేతనం అందించాలని, రెగ్యులరైజ్ చేయాలని, టైం స్కేల్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని డైలీవేజ్ వర్కర్లు సెప్టెంబర్ 12నుంచి సమ్మెబాట పట్టారు. వారు సమ్మెలో ఉండడంతో ప్రైవేట్ కార్మికులుతో విద్యార్థులకు వంటలు చేయిస్తున్నారు.
19 గిరిజన ఆశ్రమ పాఠశాలలు..
జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు 19 ఉన్నాయి. ఇందులో సుమారు 175 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే 15 గిరిజన వసతి, కళాశాలల హాస్టల్స్‌లో 22 మంది పని చేస్తున్నారు. మొత్తంగా 197 మంది పనిచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రెగ్యులర్ ఉద్యోగులు లేకపోవడంతో జాబ్‌చార్ట్‌తో సంబంధం లేకుండా అన్ని పనులు చేస్తున్నారు. హాస్టల్‌లో వంట చేయడం, పరిశుభ్రత, వడ్డించడం ఇలా పనులు చేస్తుంటారు. జనవరి నుంచి ఇప్పటి వరకు వేతనాలు లేవు. మే వేసవి సెలవుల్లో జీతం రాదు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కాగా, ఐటీడీఏలో పనిచేస్తున్న డైలీవేజ్ కార్మికులందరికీ ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని సమ్మె బాట పట్టారు.
కార్మికుల డిమాండ్లు ఇవే..
● రెగ్యులర్ చేయాలి.. టైం స్కేల్ ఇవ్వాలి
● కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనం చెల్లించాలి
● జీఓ 64ను నిలిపివేయాలి
● 212జీఓను సవరించి ఐదు సంవత్సరాల సర్వీస్ ఉన్నవారందరిని పర్మనెంట్ చేయాలి
● ఉద్యోగ భద్రత కల్పించాలి
● సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలి
● మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలి
● కార్మికులకు రెండు జతల యూనిఫాం ఇవ్వాలి
● ప్రతీ వర్కర్‌కు రూ.10లక్షల బీమా సౌకర్యాం కల్పించాలి
● పదోన్నతి బెనిఫిట్ కల్పించాలి
● విధుల్లో కార్మికులు మృతి చెందితే రూ.50 వేలు వెంటనే అందజేయాలి