
ఖైదీలు హక్కులను వినియోగించుకోవాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి
మహ్మద్ అబ్దుల్ రఫీ
మహబూబాబాద్ రూరల్: ఖైదీలు తమ హక్కులను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. జిల్లా కేంద్రంలోని సబ్ జైలును గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జైలులో న్యాయ సహాయ కేంద్రాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా అందే ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విచారణ ఎదుర్కొంటున్న ముద్దాయిలు నేరస్తులు కారని, వారి నేరం రుజువైన తర్వాత మాత్రమే నేరస్తులుగా పరిగణిస్తారన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఇటీవల రూపొందించిన స్పృహ పథకం ద్వారా జైలులో ఉన్న ముద్దాయిలకు సంబంధించిన కుటుంబీకులు ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే న్యాయ సేవాధికార సంస్థ ద్వారా సహాయం అందిస్తామన్నారు. జైలులో ఉండి కోర్టు కేసుల విచారణ ఎదుర్కొంటున్న ముద్దాయిలు ధైర్యంగా ఉండి తమ నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాలని, అవసరమైతే ఉచిత న్యాయ సహాయం పొందాలని సూచించారు. జైలులో ఖైదీలకు అందుతున్న సౌకర్యాలపై జైలు సూపరింటెండెంట్ మల్లెల శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు.