
బతుకమ్మ వేడుకల్లో పాల్గొని..
● గుండెపోటుతో యువకుడి మృతి
కురవి: బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని ఇంటికి వచ్చిన తర్వాత ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన సోమవారం రాత్రి మండలంలోని నేరడలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కొలిపాక నర్సయ్య, పద్మ దంపతుల చిన్న కుమారుడు సుమన్(28) సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు చెరువు వద్దకు వెళ్లాడు. వేడుక ముగిసిన తర్వాత ఇంటికి వచ్చి భోజనం చేసి మంచంపై కూర్చున్నాడు. గుండె వద్ద నొప్పి రావడంతోనే హఠాత్తుగా మంచంపై నుంచి కిందపడ్డాడు. దీంతో వెంటనే కుటుంబీకులు మానుకోట ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో సద్దుల బతుకమ్మ పండుగ రోజు ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.