
మమ్ముల్ని ఆదుకోండి సారూ..
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదుదారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, ఆర్డీఓ కృష్ణవేణి వినతులు స్వీకరించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో 189 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. అనంతరం పలు అంశాలపై అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీఆర్డీఓ మధుసూదన్‌రాజ్, ఇన్‌చార్జ్ సీపీఓ అశోక్, డీఎం ఇండ్రస్టీ శ్రీమన్నారాయణ, బీసీ, ఎస్సీ, మైనార్టీ అధికారులు నర్సింహారావు, శ్రీనివాస్‌రావు, డీడీ గ్రౌండ్‌వాటర్ సురేశ్, ఎల్‌డీఎం యాదగిరి, డీఎం సివిల్‌ప్లయీస్ కృష్ణవేణి, ఇన్‌చార్జ్ డీడబ్ల్యూఓ శిరీష, ఎంప్లాయ్‌మెంట్ అధికారి రజిత, గిరిజనశాఖ అధికారి దేశీరాంనాయక్, డీపీఓ హరిప్రసాద్, డీహెచ్‌ఓ మరియన్న తదితరులు పాల్గొన్నారు.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని..
● పెద్దవంగర మండలం బొమ్మకల్లు గ్రామానికి చెందిన రెడ్డబోయిన శైలజ తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, అయితే ఇంటి నిర్మాణానికి స్థలం సరిపోకపోవడంతో మరో స్థలంలో నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరింది.
● గూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకోవడానికి దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు వస్తున్నారని, వారికి బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని, వారికోసం సెల్ఫ్ మేనేజ్‌మెంట్ హాస్టల్ ఏర్పాటు చేయాలని భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య నాయకులు వినతిపత్రం అందజేశారు.
● బయ్యారం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన బానోత్ రాములు పంట రుణం కోసం దరఖాస్తు చేసుకున్నానని, అయితే అధికారుల నుంచి లెటర్ కావాలని బ్యాంకు అధికారులు అడుగుతున్నారని, లెటర్ అందించి రుణం మంజూరయ్యేలా చూడాలని వినతిలో కోరాడు.
● గూడూరు మండలం సీతానాగరం గ్రామ పరిధి భూక్య ధర్మతండాకు చెందిన దరావత్ రాజీ తన భర్త తేజ్యా ప్రమాదంలో మృతిచెందాడని, అయితే తన పేరు వేరే వారి రేషన్‌కార్డులో తప్పుగా చేర్చినందుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదన్నారు. తన పేరును సవరించాలని ఆమె కోరింది.
ప్రజావాణిలో మొరపెట్టుకున్న
దరఖాస్తుదారులు
అర్జీలు స్వీకరించిన
అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో

మమ్ముల్ని ఆదుకోండి సారూ..