హన్మకొండ: రాయితీపై నారు అందిస్తూ ప్రభుత్వం కూరగాయల సాగును ప్రోత్సహిస్తోంది. ఒక్కో రైతుకు ఐదెకరాల వరకు.. వందశాతం రాయితీపై నారును సరఫరా చేస్తోంది. ఉద్యాన శాఖ ద్వారా కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా రాయితీ సదుపాయం కల్పించింది. వందశాతం రాయితీపై టమాట, వంగ, పచ్చి మిర్చి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ నారును సరఫరా చేస్తోంది. సిద్దిపేట జిల్లా ములుగు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో రైతులు సూచించిన రకం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దీనికిగాను రైతులు 30 రోజుల ముందుగా విత్తన రకం, పట్టాదారు పాస్ బుక్, ఆధార్, బ్యాంకు ఖాతా పాస్ బుక్ జిరాక్స్ ప్రతులను జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ కార్యాలయంలో అందించాలి.
శాశ్వత పందిర్ల నిర్మాణానికి..
శాశ్వత పందిర్ల నిర్మాణం, కూరగాయల సాగుకు ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. అర ఎకరానికి రూ.50 వేల చొప్పున రెండున్నర ఎకరాలకు వరకు రాయితీ అందిస్తోంది. మల్చింగ్ పద్ధతిలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు రాయితీ అందిస్తోంది. కలుపు సమస్యను అధిగమించడానికి, ఎరువుల యాజమాన్యం, తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడి సాధించడానికి మల్చింగ్ పద్ధతి ఉపయోగపడుతుంది. ఈపద్ధతిలో సాగు ఎకరాకు రూ.8 వేల చొప్పున 5 ఎకరాల వరకు రాయితీ అందిస్తోంది.
అధిక దిగుబడి ఇచ్చేలా..
ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రం ద్వారా కూరగాయల (వంగ) సాగు వైపు రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. భూమి నుంచి సంక్రమించే వివిధ రకాల తెగుళ్లను, చౌడు నేలలను తట్టుకునేలా, అధిక దిగుబడి, ఎక్కువ కాలం దిగుబడి ఇచ్చేలా వంగలో అంటు మొక్కలను ప్రభుత్వం రాయితీపై సరఫరా చేస్తోంది. దీనికి ప్రభుత్వం ఎకరానికి రూ.30 వేల వరకు రాయితీ ఇస్తోంది. ట్రెల్లిసింగ్ విధానంలో టమాట, ఇతర కూరగాయల పంటలను సాగు చేసేందుకు ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేలు రాయితీ అందిస్తోంది. అంతేకాకుండా సూక్ష్మ సేద్యానికి రాయితీని సమకూరుస్తోంది. బిందు సేద్యానికి బీసీ, సన్నకారు, చిన్నకారు రైతులకు 90 శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం, ఇతరులకు 80 శాతం రాయితీని, తుంపర్ల సేద్యానికి అన్ని కేటగిరీల రైతులకు 75 శాతం రాయితీపై పరికారులు అందిస్తున్నారు.
ఉద్యాన రైతులను సంప్రదించాలి..
రాష్ట్ర ప్రభుత్వం కూరగాయల సాగుకు అందిస్తున్న రాయితీని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచాలి. కూరగాయలకు భారీ డిమాండ్ ఉంది. కూరగాయల సాగు లాభదాయకం. రైతులు కూరగాయల నారు, ఇతర పద్ధతిలో సాగు కోసం రాయితీ పొందేందుకు అందుబాటులో ఉన్న ఉద్యాన అధికారులను సంప్రదించాలి.
– శ్రీనివాస్‌రావు, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అఽధికారి, వరంగల్
వందశాతం రాయితీపై నారు
ఒక రైతుకు 5 ఎకరాలు పరిమితి
కూరగాయల సాగుకు ప్రోత్సాహం
కూరగాయల సాగుకు ప్రోత్సాహం