
జవాన్ అదృశ్యం మిస్టరీ వీడేనా?
మరిపెడ రూరల్: ఇటీవల ఇంటికి వచ్చిన ఓ ఆర్మీ జవాన్ నాలుగు రోజులుగా కనిపించకుండా పోవడం మిస్టరీగా మారింది. అతడు ప్రయాణించిన కారు శ్రీశైలం డ్యాం వద్ద లభ్యమైంది. అయితే అతడి ఆచూకీ మాత్రం లభించకపోవడంతో బంధువులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురం జీపీ పరిధి పూసలతండాకు చెందిన మూడు నవీన్ (28) ఢిల్లీలో ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల స్వగ్రామం వచ్చి తన భార్యకు అనారోగ్యంతో ఉండడంతో కారులో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఈ నెల 11 నుంచి అక్కడి నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో బంధువులు ఆరా తీయగా అతడు ప్రయాణించి కారు శ్రీశైలం డ్యాం సమీపంలో లభించగా, అందులో నవీన్ సెల్ ఫోన్, ఖాళీ పురుగుల మందు డబ్బా, ఐడీ కార్డులు ఉన్నాయి.
బంధువుకు
వీడియో కాల్..
ఆర్మీ జవాన్ నవీన్ 11వ తేదీన ఏడుస్తూ బంధువుకు వీడియో కాల్ చేశాడు. తాను పురుగుల మందు తాగి చనిపోతున్నానని, తనకోసం వెతకొద్దని ఏడ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా నా భార్యకు తల్లిదండ్రులు లేరని, ఆమెను, తన పిల్లలను మంచిగా చూసుకోవాలని కన్నీటి పర్యంతమైనట్లు తెలుస్తోంది. కారును డ్యాం సమీపంలో నిలిపి తాళం వైఫర్ వద్ద ఉంచుతున్నట్లు చెప్పాడని బంధువులు తెలిపారు. అనంతరం ఫోన్ స్విచ్చాఫ్ అయినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న బంధువులు కారు వద్దకు చేరుకుని గాలింపు చేపట్టారు. కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌లోని పీఎస్‌లో ఈ విషయంపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అక్కడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఎలాంటి పురోగతి లభించకపోవడంతో కుటుంబీకులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవీన్ భార్య సరిత అనారోగ్యం కారణంగా మంచం పట్టింది. కాగా, నవీన్‌కు 2023లో దంతాలపల్లి మండలానికి చెందిన సరితతో వివాహం జరగగా రెండేళ్ల కుమార్తె, రెండు నెలల కుమారుడు ఉన్నారు. నవీన్ అదృశ్యం కావడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు.
నేను చనిపోతున్నా.. నాకోసం వెతకొద్దని బంధువుకు వీడియో కాల్
మూడు రోజులుగా శ్రీశైలం డ్యాం పరిసరాల్లో గాలింపు
ఇప్పటి వరకూ లభించని ఆచూకీ
ఆందోళనలో బంధువులు, గ్రామస్తులు
అనారోగ్యంతో మంచం పట్టిన జవాన్ భార్య సరిత