
వెక్కిరిస్తున్న ఖాళీలు
మహబూబాబాద్: ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతం కోసం కృషి చేస్తోంది. పిల్లల నమోదులో భాగంగా ఈ ఏడాది అమ్మ మాట–అంగన్‌వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు. అలాగే పలు కేంద్రాలకు పెయింటింగ్ వేయించారు. ఇలా పలు అభివృద్ధి పనులు చేస్తున్న ప్రభుత్వం ఖాళీల భర్తీపై మాత్రం దృష్టిసారించడం లేదు. జిల్లాలో 588పోస్టులు ఖాళీగా ఉండడంతో.. ఇన్‌చార్జ్‌లతో నిర్వహణ చేపడుతున్నారు. దీంతో పిల్లలు విద్యపరంగా నష్టపోతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు.
1,437 కేంద్రాలు..
జిల్లాలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో 1,437 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో జీరో నుంచి ఆరు నెలలలోపు పిల్లలు 2,522 మంది, ఏడు నుంచి మూడు సంవత్సరాలలోపు పిల్లలు 18,872 మంది, మూడు నుంచి ఆరు సంవత్సరాలలోపు పిల్లలు 15,930మంది.. మొత్తంగా 37,324 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. గర్భిణులు 3,988 మంది, బాలింతలు 2,790మంది ఉన్నారు.
ఇన్‌చార్జ్ డీడబ్ల్యూఓ...
రెగ్యులర్ డీడబ్ల్యూఓగా పని చేసిన ధనమ్మ గత నెల 30న ఉద్యోగ విరమణ పొందారు. ఆ పోస్టు ఖాళీగా ఉండడంతో ఈనెల 1న మానుకోట ప్రాజెక్ట్ సీడీపీఓగా పని చేస్తున్న శిరీషకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొందిమంది టీచర్లు, ఆయాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు 58 మంది సూపర్‌వైజర్ పోస్టులకు 46 మంది మాత్రమే ఉండడం కూడా.. పర్యవేక్షణ కొరవడింది.
ఎన్నికల షెడ్యూల్‌లోపే పోస్టులు
భర్తీ చేయాలని విజ్ఞప్తి ..
స్థానిక సంస్థలు, మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణకు ముందే అంగన్‌వాడీ పోస్టులు భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఖాళీల వివరాలు పంపాం
ఖాళీల వివరాలు ప్రభుత్వానికి పంపించాం. రిటైర్మెంట్ కాగానే అప్‌డేట్ చేస్తూ మళ్లీ జాబితా పంపుతున్నాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. టీచర్ ఖాళీగా ఉన్న కేంద్రాలకు ఇన్‌చార్జ్‌లను నియమించాం. సౌకర్యాలు లేని కేంద్రాల జాబితాను కూడా ప్రభుత్వానికి పంపాం. అధికారుల ఆదేశాలతో తదుపరి చర్యలు తీసుకుంటాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా కేంద్రాలను నిర్వహిస్తున్నాం.
– శిరీష, ఇన్‌చార్జ్ డీడబ్ల్యూఓ
ఇన్‌చార్జ్‌ల నియామకం..
జిల్లాలో 115 అంగన్‌వాడీ టీచర్, 473 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆయాలు ఉన్న కేంద్రాలకు పక్క సెంటర్ల టీచర్లను ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. దీంతో తమ సొంత సెంటర్లపై దృష్టి సారించలేకపోతున్నామని పలువురు టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు విద్యపరంగా నష్టపోవాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా కొన్ని కేంద్రాల్లో టీచర్‌తో పాటు ఆయాలు కూడా రిటైర్మెంట్ అయ్యారు. ఆ కేంద్రాల పరిస్థితి దయనీయంగా మారింది.
588 అంగన్‌వాడీ టీచర్లు, ఆయా పోస్టులు ఖాళీ
భారంగా కేంద్రాల నిర్వహణ
కనీస సౌకర్యాలు కరువు
సమయపాలన పాటించని
పలువురు టీచర్లు
కనీస సౌకర్యాలు కరువు..
జిల్లాలో 330 అంగన్‌వాడీ కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. 1,437 కేంద్రాలకు గానూ 732 కేంద్రాల్లో మరుగుదొడ్లు లేవు.. 703 కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం లేదు. 397కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం లేదని ఇటీవల ప్రతిపాదనలు తయారు చేసి పంపారు.