
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
మరిపెడ రూరల్: జిల్లాలో కొందరు ఆర్‌ఎంపీలు పరిమితికి మించి వైద్య చేస్తున్నారు. ఈమేరకు సాక్షి దినపత్రికలో ‘పరిధి దాటుతున్నారు’ అనే శీర్షికన ఆదివారం ప్రచురితమైన కథనంపై డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్ స్పందించారు. మరిపెడ పట్టణంలోని మంద వెంకన్న నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ సోమవారం ఆకస్మికంగా సందర్శించి అక్కడ రోగులకు అందుతున్న చికిత్స విధానాన్ని పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా చికిత్స చేస్తుండడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రథమ చికిత్స కేంద్రాన్ని సీజ్ చేశారు. అక్కడి రోగులను 108 వాహనం ద్వారా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఐదు మెడికల్ షాపులకు
సస్పెన్షన్ నోటీసులు..
మరిపెడ పట్టణంలోని మెడికల్ షాపులకు జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఉమారాణి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఏ టు జెడ్, కేర్, సాయిమారుతి, అపోలో, సీజ్ చేసిన ప్రథమ చికిత్స కేంద్రంలోని షాపునకు డీఐ సస్పెన్షన్ నోటీసులు ఇచ్చారు. వారం రోజుల పాటు ఈ ఐదు మెడికల్ షాపు మూసివేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, సీహెచ్‌ఓ విద్యాసాగర్, పారామెడికల్ అధికారి వనాకర్‌రెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చర్యలు
తొర్రూరు: నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ బి.రవిరాథోడ్ అన్నారు. డివిజన్ కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను సోమవారం తనిఖీ చేశారు. డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ..ఆస్పత్రుల్లో పని చేసే వైద్యుల వివరాలను వైద్యశాఖలో నమోదు చేసి అనుమతులు పొందాలన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు అందించే చికిత్సల ధరలు బోర్డుపై ప్రదర్శించాలన్నారు. వైద్యం అందించే వారికి తగిన విద్యార్హతలు ఉండాలని, బోగస్ ధ్రువ పత్రాలతో కొనసాగితే క్రిమినల్ కేసులు తప్పవన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, డీపీఎంఓ వనాకర్‌రెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ కేవీ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ

ప్రథమ చికిత్స కేంద్రం సీజ్