సాక్షి, మహబూబాబాద్: నిరుపేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ప్రభుత్వం.. ఇందిరమ్మ ఇళ్లకు ఇచ్చేందుకు వెనకడుగు వేస్తోంది. ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు అయినా.. సొంతంగా ఇల్లు కట్టినా కమర్షియల్ కేటగి రీ–2 మీటర్ మాత్రమే ఇస్తామని విద్యుత్ శాఖ అధికారులు తేల్చి చెబుతున్నారు. దీంతో ఇల్లు కట్టడం కన్నా.. విద్యుత్ కనెక్షన్ కోసం ముందుగా అప్పులు చేయాల్సి వస్తోందని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వాపోతున్నారు.
ఉచితంగా కనెక్షన్ ఇవ్వాలి..
గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లు, ఇతర పథకాలతో నిర్మించిన ఇళ్లకు నామమాత్రపు రుసుముతో విద్యుత్ కనెక్షన్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదని, డబ్బులు చెల్లిస్తేనే కనెక్షన్ ఇస్తామని అధికారులు అంటున్నారు. కాగా జల్లాలోని 18 మండలాల పరిధిలో 1,89,065 దరఖాస్తులు, మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీల్లో 28,526.. మొత్తంగా 2,17,591 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో మొదటి విడతలో 7,984 ఇళ్లు మంజూరు చేశారు. ఇందులో ఐదు వేలకు పైగా ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో పాత ఇంటి స్థలంలో ఇల్లు నిర్మించుకుంటున్న వారు కొందరైతే.. కొత్త స్థలంలో ఇల్లు నిర్మించుకునే వారు సుమారు 2వేలకు పైగా ఉంటారని అంచనా. ఇల్లు నిర్మాణం మొదలు పెట్టి బేస్‌మెంట్ లెవల్ వరకు నిర్మాణం పూర్తి చేస్తే రూ.లక్ష, స్లాబ్ వరకు గోడల నిర్మాణానికి రూ.లక్ష, స్లాబ్ పడిన తర్వాత రూ.2లక్షలు, ఇల్లు పూర్తి అయిన తర్వాత మిగిలిన రూ.లక్ష, ఇలామెత్తం రూ.5లక్షలు చెల్లిస్తారు. కాగా లబ్ధిదారులు ముందు అప్పులు చేసి ఇంటి నిర్మాణాలు మొదలుపెడుతున్నారు. వాటికి తోడు ఇప్పుడు కరెంట్ ఖర్చులు అధికం అవుతున్నాయి. కావునా ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
ఇందిరమ్మ ఇళ్లకు కేటగిరీ–2 మీటర్ పెడతామంటున్న అధికారులు
కొత్తగా ఖాళీ స్థలంలో
నిర్మాణం చేస్తే అదనపు ఖర్చులు
ఉచితంగా కనెక్షన్
ఇవ్వాలంటున్న పేదలు
‘మహబూబాబాద్ పట్టణానికి చెందిన కర్పూరపు అనిల్‌కు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. జమాండ్లపల్లి రోడ్డులో ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. అధికారులు వచ్చి ముగ్గు పోశారు. ఇంటికి కరెంట్ మీటర్ కోసం విద్యుత్ అధికారులను సంప్రదించగా.. కొత్త ఇల్లు కాబట్టి కేటగిరీ–2 మీటర్ తీసుకోవాలి. ఐదు స్తంభాలు, వైర్లు కొనుగోలు చేయాలి. ఇందుకోసం రూ. 65వేల మేరకు ఖర్చు అవుతుందని చెప్పారు. కాగా మొదటి బిల్లు వస్తుందని బేస్‌మెంట్ వరకు నిర్మాణం కోసం రూ.1.5లక్షలు అప్పు చేశాడు. ఈక్రమంలో కరెంట్ కోసం అదనంగా అప్పు చేయలేక దూరంగా ఉన్న బావుల నుంచి నీరు తీసుకొచ్చి క్యూరింగ్ చేస్తున్నాడు.’
ఆ మీటరే ఇస్తాం..
ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్న లబ్ధిదారులు విద్యుత్ కనెక్షన్ కోసం అధికారుల వద్దకు వెళ్లగా, కేటగిరీ–2 మీటర్ మాత్రమే బిగిస్తామని చెబుతున్నారు. నిరుపేదలకు అవసరమైన విద్యుత్ వినియోగం కోసం కేజీ వాట్స్ విద్యుత్ కోసం కేటగిరీ–1 అయితే డెవలప్‌మెంట్ చార్జీలు కలిపి రూ.28,00, కేటగిరీ–2 అయితే రూ.3800 మీసేవలో చలాన్ చెల్లించాలి. అది తీసుకొని విద్యుత్ అధికారుల వద్దకు వస్తే అక్కడ పరిస్థితులను బట్టి మరో రూ.వెయ్యి నుంచి రూ. 2వేల మేరకు ఖర్చు అవుతుందని వినియోగదారులు అంటున్నారు. విద్యుత్ స్తంభం దూరంగా ఉంటే 30 మీటర్లకు ఒక పోల్ చొప్పున వైర్లు, కాసారాలకు ఇతర పరికరాలకు రూ.6 వేల మేరకు చెల్లించాలి. ఐదారు పోల్స్ దూరం అయితే విద్యుత్ కనెక్షన్, పోల్స్, ఇతర విద్యుత్ పరికరాలకు చలా వరకు డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.