
మార్కెట్‌లో రైతుల పడిగాపులు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం రైతులు పడిగాపులు పడ్డారు. వ్యాపారులు సమయానికి వచ్చి ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పలేదు. ఈక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి షంషీర్ వద్దకు రైతులు వచ్చి కొనుగోళ్లు చేపట్టాలని కోరారు. ఆయన వ్యాపారులతో మాట్లాడి మధ్యాహ్నం 2.30 గంటలకు ధాన్యం, అపరాల కొనుగోళ్లు జరిపించారు. ఉదయం 9 గంటలకు కొనుగోళ్లు నిర్వహించాల్సిన వ్యాపారులు మధ్యాహ్నం 2.30 గంటలకు ఆలస్యంగా రావడంతో రైతులు అవస్థలు పడ్డారు.
నోటీసులు ఇవ్వడమే కారణమా..
ఇటీవల వ్యాపారులకు మార్కెట్ అధికారులు నోటీసులు ఇవ్వడమే ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యానికి కారణమని తెలిసింది. వ్యవసాయశాఖ జేడీఎం, డీడీఎం తనిఖీలకు వచ్చినప్పుడు 2024–25 వార్షిక సంవత్సరానికి సంబంధించి వ్యాపారులు సరైన వివరాలు అందించలేదని తెలిసింది. ఈ విషయంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యాపారులకు మెమోలు ఇచ్చినట్లు సమాచారం. అలాగే మార్కెట్ ఆవరణ, రైస్ మిల్లు వద్ద జరిపిన కొనుగోళ్ల వివరాలు తక్ పట్టీల ప్రకారం ఇవ్వాలని వ్యాపారులకు వ్యవసాయ మార్కెట్ అధికారులు నోటీసులు పంపించినట్లు తెలిసింది. అంతే కాకుండా క్రయవిక్రయాల ప్రక్రియపై కోల్డ్ స్టోరేజీల వద్ద కూడా సిబ్బందిని నియమించారు. దీంతో మార్కెట్ అధికారులు అడిగిన విధంగా వ్యాపారులు వివరాలు సమర్పించకుండా తమ ఇష్టం వచ్చినట్లు అందజేసినట్లు సమాచారం. ఈమేరకు తమకు నోటీసులు పంపించడం ఏమిటని ప్రశ్నిస్తూ, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వ్యాపారులు కొనుగోళ్లకు రాకుండా ఉన్నట్లు తెలిసింది.
ఆలస్యంగా ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారులు

మార్కెట్‌లో రైతుల పడిగాపులు