భూ కేటాయింపు ఆమోదాన్ని వెనక్కి తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

భూ కేటాయింపు ఆమోదాన్ని వెనక్కి తీసుకోవాలి

Jul 4 2025 6:43 AM | Updated on Jul 4 2025 6:43 AM

భూ కేటాయింపు ఆమోదాన్ని వెనక్కి తీసుకోవాలి

భూ కేటాయింపు ఆమోదాన్ని వెనక్కి తీసుకోవాలి

కేయూ క్యాంపస్‌: యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణానికి కాకతీయ యూనివర్సిటీ భూములు కేటాయిస్తూ యూనివర్సిటీ పాలకమండలి ఆమోదించిందని, ఈ ఆమోదాన్ని వెనక్కి తీసుకోవాలని వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం రిజిస్ట్రార్‌ చాంబర్‌లో బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనివర్సిటీ అధికారులు ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణానికి భూ కేటాయింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ఈనెల 7న జరిగే స్నాతకోత్సవాన్ని అడ్డుకుంటామన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఓ వర్గాన్ని తయారు చేసుకుని ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ను యూనివర్సిటీ భూముల్లోనే నిర్మించేలా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇది సరికాదని, యూనివర్సిటీ బయట ప్రభుత్వ భూముల్లోనే ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మించాలని డిమాండ్‌ చేశారు. కాగా, ఆందోళన సమయంలో రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం చాంబర్‌లోనే ఉన్నారు. రెండు గంటలకుపైగా ఆందోళన కొనసాగడంతో రిజిస్ట్రార్‌ వద్దకు వివిధ పనుల నిమిత్తం వెళ్లేవారికి అవకాశం లేకుండా పోయింది. ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ రామచంద్రం మాట్లాడుతూ స్కూల్‌ నిర్మాణానికి భూమిని కేటాయిస్తూ పాలకమండలిలో ఆమోదించారని,ఆ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలంటే మళ్లీ పాలకమండలిలోనే చర్చించాల్సింటుందన్నారు. ఆందోళన సమాచారం అందుకున్న కేయూ సీఐ రవికుమార్‌, ఎస్సై నవీన్‌కుమార్‌ ఘటనాస్థలికి చేరుకుని విద్యార్థి సంఘాల బాధ్యులను కేయూ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ కొద్ది సమయం తర్వాత విడిచిపెట్టారు. కార్యక్రమంలో ఏఐఎఫ్‌డీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గడ్డం నాగార్జున, రాష్ట్ర గర్ల్స్‌ కన్వీనర్‌ మాస్‌ సావిత్రి, డీఎస్‌ఏ రాష్ట్ర కన్వీనర్‌ కామగోని శ్రావణ్‌, కోకన్వీనర్‌ మున్నా గణేశ్‌, బీఆర్‌ఎస్‌వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్‌, బాధ్యులు వీరస్వామి, వస్త్రం అనిల్‌, కొత్తూరు రోహిత్‌,స్వేరో స్టూడెంట్స్‌ యూనియన్‌ హనుమమకొండ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్‌, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి మర్రి మహేశ్‌, ఏఐడీఎస్‌ఓ జిల్లా ఉపాధ్యక్షులు మధు, సురేశ్‌, ఎస్‌ఎఫ్‌ఐ యూనివర్సిటీ అధ్యక్షుడు సాయి, యూనివర్సిటీ కన్వీనర్‌ అన్నమయ్య తదితరులు పాల్గొన్నారు.

లేనిపక్షంలో కేయూ స్నాతకోత్సవాన్ని అడ్డుకుంటాం

వివిధ విద్యార్థి సంఘాల బాధ్యుల డిమాండ్‌

రిజిస్ట్రార్‌ చాంబర్‌లో ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement