
త్వరితగతిన ఇళ్లు నిర్మించుకోండి
బయ్యారం: లబ్ధిదారులు త్వరితగతిన ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సూచించారు. గురువారం మండలంలోని కాచనపల్లి, గురిమెళ్ల, గౌరారం, ఉప్పలపాడు, నర్సాతండా, వెంకట్రాపురం, బాలాజీపేట, బాల్య తండా, బయ్యారం, జగ్గుతండా, సంతులాల్‌పోడుతండా, కొత్తపేట, సింగారం పంచాయతీల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇళ్లు నిర్మించుకునేవారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తేవాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు విద్యుత్ తీగలు అడ్డువస్తే వెంటనే తొలగించాలన్నారు. అనంతరం సింగారంలో నూతనంగా నిర్మించిన బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
ఎమ్మెల్యేకు ఫిర్యాదులు..
అర్హులకు కాకుండా అనర్హులకు ఇళ్లు కేటాయించారని వెంకట్రాంపురం, బాలాజీపేట పంచాయతీల్లో పలువురు ఎమ్మెల్యేకు ఫిర్యాదులు అందజేశారు. భూములు, ఆర్థికంగా ఉన్న వారికి ఇళ్లు మంజూరు చేశారని, అర్హులకు అన్యాయం చేశారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇళ్ల కేటాయింపులో తమకు న్యాయం చేయాలని మహిళలు కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మరో దఫా అర్హులకు ఇళ్లు అందేలా చూస్తామని హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ విజయలక్ష్మి, గార్ల–బయ్యారం సీఐ రవికుమార్, ఎస్సై తిరుపతితో పాటు పలువురు అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య