
పెరుగుతున్న గోదావరి
వాజేడు: వరద నీరు ఉధృతంగా వస్తుండడంతో గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో గోదావరి మట్టం పెరగడంతో ములుగు జిల్లా వాజేడు మండలంలో రహదారులు పలు చోట్ల ముంపునకు గురి కావడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండల పరిధిలోని పేరూరు, కృష్ణాపురం గ్రామాల మధ్యన మోడి కుంట వాగు ద్వారా రహదారిపైకి వరద నీరు చేరడంతో కృష్ణాపురం, కడేకల్, పెద్ద గంగారం, చండ్రుపట్ల, టేకులగూడెం, టేకులగూడెం కాలనీ గ్రామాలు, పేరూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ గ్రామాల ప్రజలు పేరూరుకు రావాలంటే జాతీయ రహదారిపై నుంచి చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. అదేవిధంగా మండల కేంద్రం సమీపంలో కొంగల వాగు ద్వారా వచ్చిన గోదావరి వరద రహదారిని ముంచింది. దాంతో వాజేడు, గుమ్మడిదొడ్డి గ్రామాల మధ్యన రాకపోకలు నిలిచాయి. కొంగల వాగు అవతల ఉన్న సుమారు 25 గ్రామాల ప్రజలు వాజేడు మండల కేంద్రానికి రావాలంటే జగన్నాథపురం మీదుగా రావాలి. మండల పరిధిలోని పూసూరు, ఏడ్జర్లపల్లి గ్రామాల మధ్యన ఉన్న వంతెనపైకి వరద నీరు చేరడంతో ఇక్కడ కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏడ్జర్లపల్లి, బొమ్మనపల్లి, ముత్తారం, కొత్తూరు గ్రామాల ప్రజలు చుట్టూ తిరిగి వెంకటాపురం(కె) మీదుగా వాజేడుకు రావాల్సి ఉంది. కోయ వీరాపురం గ్రామ సమీపంలో చాకలి వాగు వద్ద రహదారిపైకి గోదావరి చేరడంతో గ్రామస్తులు చీకుపల్లి మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది.
అప్రమత్తమైన అధికారులు
గోదావరి వరద అంతకంతకు పెరుగుతుండడంతో పాటు పలు చోట్ల రహదారులను ముంచెత్తడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వరదను పరిశీలించిన తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీకాంత్ నాయుడు, ఆర్‌ఐ కుమారస్వామి.. గ్రామ పంచాయతీ సిబ్బందిని ఎక్కడికక్కడ అప్రమత్తం చేశారు. రహదారులపైకి వరద నీరు చేరడంతో నీటిలోకి ఎవరూ వెళ్లకుండా ట్రాక్టర్లు అడ్డంగా పెట్టడమే కాకుండా కర్రలతో అడ్డుగా కంచె కట్టారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.
నీట మునిగిన రహదారులు
పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
పెరుగుతున్న నీటి మట్టం
ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. గురువారం సాయంత్రం గోదావరి నీటి మట్టం 14.28 మీటర్లు ఉండగా, శుక్రవారం సాయంత్రానికి 15.42 మీటర్లకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండడంతో గోదావరి నీటి మట్టం పెరుగుతున్నట్లు సీడబ్ల్యూసీ సిబ్బంది తెలిపారు. పూసూరు హైలెవల్ బ్రిడ్జి వద్ద గోదావరి వరద పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఇప్పటికే పలు చోట్ల రహదారులు నీట మునిగాయి. మండల అధికారులు అప్రమత్తమై మండలంలోని పునరావాస కేంద్రాలను శుభ్రం చేసి సిద్ధం చేశారు. వాగులు వంకల వద్దకు ప్రజలు వెళ్లకుండా రహదారులపై ట్రాక్టర్లు అడ్డంగా ఉంచారు.

పెరుగుతున్న గోదావరి

పెరుగుతున్న గోదావరి

పెరుగుతున్న గోదావరి