
సమస్యల తిష్ట..
మహబూబాబాద్ అర్బన్: నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. విద్యార్థులు సంక్షేమ హాస్టళ్లలో చేరుతున్నారు. అయితే జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో అరకొర వసతులు మధ్య విద్యార్థులు చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వసతి గృహాల పరిసరాలు అపరిశుభ్రంగా, అధ్వానంగా ఉన్నాయి. విషపురుగులు సంచరిస్తున్నాయి. అలాగే పడుకోవడానికి సరైన బెడ్లు లేవు. గదులకు డోర్లు, కిటికీలు లేకపోవడంతో విద్యార్థులు దోమలతో సావాసం చేయాల్సి పరిస్థితి ఉంది.
జిల్లా కేంద్రంలోని హాస్టళ్లలో..
జిల్లా కేంద్రంలోని కేసముద్రం రోడ్డులోని గిరిజన బాలికల కళాశాల హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరింది. 100 మంది విద్యార్థినులు ఉన్నారు. కాగా ఆ భవనం పెచ్చులూడి పడుతుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని విద్యార్థినులు భయంగా కాలం వెల్లదీస్తున్నారు. అలాగే ఎస్టీ బాలుర కళాశాల హాస్టల్‌లో సరైన వంట గదిలేక ఓపెన్ షెడ్డులో వంటలు వండుతున్నారు. వర్షం వచ్చినప్పుడు వంట నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. మినరల్‌వాటర్ ప్లాంట్ మరమ్మతులకు గురైంది. అదేవిధంగా బీసీ బాలికల హాస్టల్ అద్దె భవనంలో కొనసాగుతోంది. పూర్తిగా రేకులతో కూడిన గదులు ఉండడం, వర్షం పడినప్పుడు విద్యార్థులు హాల్‌లోకి వెళ్లి నిద్రించాల్సిన పరిస్థితి నెలకొంది.
జిల్లాలోని పలు హాస్టళ్లలో..
జిల్లాలోని పలు ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో మరుగుదొడ్ల, బాత్‌రూమ్‌లు ధ్వంసమయ్యాయి. దీంతో విద్యార్థులు ఆరుబయటకు వెళ్తున్నారు. అలాగే బెడ్లు లేకపోవడంతో విద్యార్థులు కింద పడుకోవాల్సి వస్తోంది. ఫ్యాన్లు తిరగడం లేదు. మినరల్ వాటర్ అందడం లేదు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.
వర్కర్ల ఇష్టారాజ్యం..
ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో విధులు నిర్వర్తించే అవుట్ సోర్సింగ్ వర్కర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
మాకు ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్ తెలుసు అని అధికారులను బెదిరిస్తూ.. వారు చెప్పిన పనులు చేయడం లేదని సమాచారం.
పాములు తిరుగుతున్నాయి..
హాస్టల్ ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగాయి. చెత్తాచెదారం పేరుకుపోయి పాములు తిరుగుతున్నాయి. భయంగా ఉంది. పరిసరాలను శుభ్రం చేయాలి.
– కె.సంతోష్, విద్యార్థి,
ఎస్సీ బాలుర హాస్టల్, మానుకోట
మెనూ ప్రకారం భోజనం అందించాలి
ప్రతీ రోజు మెనూ ప్రకారం భోజనం, టిఫిన్ అందడం లేదు. రుచిగా ఉండడం లేదు. వంట నిర్వాహకులను అడిగితే ఇంటి దగ్గర ఇంతకంటే మంచి భోజనం పెడుతున్నారా అని వెటకారంగా మాట్లాడుతున్నారు. పడుకోవడానికి బెడ్లు కూడా లేవు. ఐరన్ బెడ్లలోనే రెండు దుప్పట్లు వేసుకొని పడుకుంటున్నాం. వెంటనే అన్ని సౌకర్యాలు కల్పించాలి.
– ఎస్.సంజయ్, ఎస్సీ హాస్టల్
జిల్లాలోని హాస్టళ్ల వివరాలు
హాస్టల్ హాస్టళ్ల విద్యార్థుల
సంఖ్య సంఖ్య
ఎస్సీ సంక్షేమ హాస్టల్స్ 24 1100
గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ 34 7457
బీసీ సంక్షేమ హాస్టల్స్ 14 865
వసతి గృహాల్లో అరకొర వసతులు
అపరిశుభ్రంగా హాస్టళ్ల పరిసరాలు
సంచరిస్తున్న విషపురుగులు
విద్యార్థులకు తప్పని తిప్పలు

సమస్యల తిష్ట..

సమస్యల తిష్ట..