
లాభాల పంట !
ఆయిల్‌పామ్ సాగుతో ఎకరానికి రూ.లక్ష వరకు ఆదాయం
మహబూబాబాద్ రూరల్ : రైతులకు దీర్ఘకాలికంగా ఆదాయం అందించే ఆయిల్‌పామ్ సాగుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈమేరకు పంటను సాగుచేసేలా అన్నదాతలను ప్రోత్సహిస్తోంది. నూనె వినియోగానికి సరిపడా పంటసాగు లేకపోవడంతో ఏటా దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా ఆదాయం కోల్పోవడంతో పాటు అధిక ధరలకు నూనెలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం ఆయిల్ పామ్ పంట సాగుకు సబ్సిడీ, ప్రోత్సాహకాలు అందిస్తోంది. కాగా, మొక్కలు నాటిన నాలుగేళ్ల తర్వాత పంట చేతికొస్తుంది.
జిల్లాలో 8,625 ఎకరాల్లో సాగు..
జిల్లాలో 8,625 ఎకరాల్లో రైతులు పంట సాగుచేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 1,380 ఎకరాల్లో దిగుబడులు మొదలై 99 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు ద్వారా ఎకరానికి లక్ష నుంచి లక్షన్నర వరకు ఆదాయం పొందుతున్నారు.
పంటతో ప్రయోజనాలు..
ఆయిల్‌పామ్ మొక్కలు నాటిన తర్వాత నాలుగో ఏడాది నుంచి కాపు మొదలై 30ఏళ్ల్ల పాటు ఆదాయం పొందవచ్చు. ఈ మొక్కలు పెరిగే వరకు మొదటి మూడేళ్ల వరకు అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. అరటి, బొప్పాయి, జామ, మల్బరీ, మొక్కజొన్న, కూరగాయలు, వేరుశనగ, మినుము, పెసర, నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమ, మిరప, పత్తి వేసుకోవచ్చు. ఈ తోటకు తెగుళ్లు, చీడపీడల బెడద తక్కువ. తుపాన్, వడగండ్ల వాన, ప్రకృతి వైపరీత్యాలను సైతం ఈ మొక్కలు సమర్థంగా తట్టుకుంటాయి. అలాగే అడవి పందులు, దొంగల బెడద ఉండదు. రవాణా, మార్కెటింగ్, ప్రాసెసింగ్ సౌకర్యాలు ప్రభుత్వం, ప్రైవేటు వ్యాపారులు కల్పిస్తున్నారు.
తక్కువ నీటి వినియోగం..
ఆయిల్‌పామ్ మొక్కలకు తక్కువ నీరు అవసరం ఉంటుంది. వేసవిలోనూ నీరందించే బోరు బావుల కింద సాగు చేయడం మేలు. అయితే ఎకరం వరి సాగుకు అవసరమయ్యే నీటితో 3 నుంచి 4 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేసుకుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీలకు పూర్తి రాయితీపై
డ్రిప్ పరికరాలు..
ఆయిల్‌పామ్ సాగు చేసే ఎస్సీ, ఎస్టీ రైతులకు బిందు సేద్యం పరికరాలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. బీసీలకు 90శాతం, ఇతర రైతులకు 80 శాతం రాయితీతో ఈ పరికరాలు ఇస్తారు. 5 హెక్టార్ల వరకు డ్రిప్ రాయితీ ఉంటుంది. చిన్న, సన్నకారు రైతులకు, దివ్యాంగులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
తక్కువ పెట్టుబడితో అధిక లాభం
రైతులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
జిల్లాలో 8,625 ఎకరాల్లో సాగు
భారీ రాయితీతో డ్రిప్ పరికరాల అందజేత
ఆయిల్‌పామ్ ఎకరానికి రాయితీ ఇలా..
ఎకరం ఆయిల్‌పామ్ సాగుకు మొక్కలు, డ్రిప్, అంతర పంటల సాగు, ఎరువుల యాజమాన్యం కోసం ప్రభుత్వం రూ.50వేల సబ్సిడీ ఇస్తోంది. ఆయిల్ పామ్ మొక్కలకు రూ.11,600, బిందు సేద్యం కోసం రూ.22,518 రాయితీ కల్పించనున్నారు. మొదటి నాలుగేళ్ల వరకు ఎకరానికి అంతర పంటల కోసం రూ.2,100, మొక్కల యాజమాన్య ఎరువులకు రూ.2,100, మొత్తం ఏడాదికి రూ.4,200 చొప్పున రైతుల బ్యాంక్‌ఖాతాల్లో జమ చేస్తారు.

లాభాల పంట !

లాభాల పంట !