
అప్పు తీర్చలేక రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
కేసముద్రం: అప్పు తీర్చలేక మనస్థాపానికి గురైన ఓ రైల్వే ఉద్యోగి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. ఎస్సై మురళీధర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌లోని బండ్లగూడకు చెందిన కోమటిరెడ్డి రామక్రిష్ణారెడ్డి (38) మూడేళ్లుగా కేసముద్రం మున్సిపాలిటీలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటూ, కురవి మండలంలోని గుండ్రాతి మడుగు రైల్వేస్టేషన్‌లో కీమాన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నాడు. ఈ క్రమంలో అప్పు ఇచ్చిన వారు ఈనెల 9న ఇంటికి వచ్చి తమ అప్పు తీర్చాలని గొడవకు దిగారు. దాంతో అదే రోజు తీవ్ర మనస్థాపానికి గురైన రామక్రిష్ణారెడ్డి.. గుండ్రాతిమడుగు రైల్వేస్టేషన్ నుంచి ఇంటికి వస్తూ కేసముద్రం మండలం రాజీవ్‌నగర్ తండా వద్ద గడ్డి మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హనుమకొండలోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి భార్య స్రవంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.
రేప్ కేసులో ఐదేళ్ల జైలు
వెంకటాపురం(కె): ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని వాడగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి రేప్ కేసులో ఐదేళ్ల జైలుశిక్ష పడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వెంకటాపురం సీఐ బండారి కుమార్ వివరాల ప్రకారం రేప్ కేసులో జాడి రోశయ్యకు ములుగు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌వీపీ సూర్యచంద్రకళ శుక్రవారం ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. కేసు నమోదు చేసిన ఎస్సై రేక అశోక్, దర్యాప్తు చేసిన ఎస్సై కొప్పుల తిరుపతి రావు, శిక్షపడేలా కృషి చేసిన ప్రాసిక్యూటర్, కోర్టు కానిస్టేబుల్‌ను పలువురు అభినందించారు.
చుట్ట తాగుతూ నిద్రలోకి..
నిప్పంటుకొని వృద్ధురాలి మృతి
రఘునాథపల్లి: చుట్ట తాగుతూ ఓ వృద్ధురాలు నిద్రలోకి జారుకోగా.. ప్రమాదవశాత్తు నిప్పంటుకొని తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మండలంలోని జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపూర్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన పండుగ వెంకటలక్ష్మి (95) ఒంటరిగా జీవనం సాగిస్తోంది. చుట్ట తాగుడు అలవాటు ఉన్న ఆమె.. గురువారం ఉదయం మంచంపై పడుకొని చుట్ట తాగుతూ నిద్రలోకి జారుకుంది. ప్రమాదవశాత్తు మంచంపై ఉన్న బెడ్‌షీట్లకు చుట్ట అంటుకొని మంటలు లేచాయి. వెంకటలక్ష్మి తేరుకొని లేచే సరికి మంటలు చుట్టుముట్టాయి. ఇంట్లో మంటలను గుర్తించిన స్థానికులు వెంటనే తలుపులు ఊడదీసి మంటలను చల్లార్చగా అప్పటికే ఆమె తీవ్ర గాయాలపాలైంది. వెంటనే జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కక చికిత్స పొందుతూ మరణించింది. మృతురాలి కుమారుడు పండుగ మదార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దూదిమెట్ల నరేష్ తెలిపారు.

అప్పు తీర్చలేక రైల్వే ఉద్యోగి ఆత్మహత్య