
గంజాయి మత్తులో యువత వీరంగం
ఖిలా వరంగల్: వరంగల్ మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో యువత గంజాయి మత్తులో వీరంగం సృష్టిస్తోంది. అర్ధరాత్రి వరకు బైకుల హారన్ల మోత, కేరింతలతో రహదారులపై ఆకతాయిలు చక్కర్లు కొడుతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై విరుచుకు పడుతున్నారు. ఈ క్రమంలో బీట్ పోలీసులు ఉన్నా లేనట్లేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. అడిగింది ఇవ్వకపోతే చిరువ్యాపారులపై మత్తులో ఉన్న పోకిరీలు విచక్షణ రహితంగా దాడికి తెగబడుతున్నారు. ఈ తరహా ఘటన గురువారం అర్ధరాత్రి వరంగల్ శంభునిపేటలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. రంగశాయిపేట గవిచర్ల క్రాస్ రోడ్డులోని ఓ ఐస్‌క్రీమ్ బండి వద్ద కొంతమంది ఐస్‌క్రీమ్ తిన్నారు. డబ్బులు ఇవ్వాలని అడిగితే ఆ చిరు వ్యాపారితో పాటు అడ్డుకోబోయిన కేడల నరేష్, బజ్జూరి వంశీపై ఆకతాయిలు దాడికి చేశారు. ఈ దాడిలో కేడల నరేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న స్థానిక మిల్స్ కాలనీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించినట్లు సమాచారం.
ఇద్దరిపై దాడి.. ఒకరి పరిస్థితి విషమం
ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు

గంజాయి మత్తులో యువత వీరంగం