
మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో..
ఏటూరునాగారం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద గంట గంటకు పెరుగుతోంది. మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటి మట్టం శుక్రవారం ఉదయం 10 గంటలకు 14.09 మీటర్లు ఉండగా, రాత్రి 8 గంటలకు 14.48 మీటర్లకు చేరింది. గంటగంటకు వరద నీరు పెరుగుతుండడంతో మొదటి ప్రమాద హెచ్చరికకు (14.80 మీటర్లు) చేరువలో వరద ప్రవాహం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను గోదావరి చుట్టూ పక్కల గ్రామాల్లో సిద్ధం చేసి ఉంచారు. వారి వద్ద పడవలు, లైఫ్‌జాకెట్లతో పాటు రబ్బర్ బోట్లను ఉంచారు. ఎక్కడైనా విపత్తు ప్రమాదం జరిగితే వెంటనే పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శులకు ప్రజలు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. కోయగూడ ఎల్లాపురం గ్రామంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలున్నాయని, ఎలాంటి భయాందోళనకు గ్రామస్తులు గురికావొద్దని అవగాహన కల్పించినట్లు రామన్నగూడెం పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ తెలిపారు.
రామన్నగూడెం వద్ద 14.48 మీటర్ల మేర వరద ప్రవాహం
రంగంలోకి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు

మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో..