యథావిధిగా డిగ్రీ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

యథావిధిగా డిగ్రీ పరీక్షలు

May 13 2025 1:06 AM | Updated on May 13 2025 1:06 AM

యథావిధిగా డిగ్రీ పరీక్షలు

యథావిధిగా డిగ్రీ పరీక్షలు

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీసీఏ తదితర కోర్సులు 2, 4, 6 సెమిస్టర్ల పరీక్షలు ఈనెల 14నుంచి(బుధవారం) నిర్వహించనున్నారు. అలాగే, బ్యాక్‌లాగ్‌ డిగ్రీ కోర్సుల మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ల పరీక్షలు కూడా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే వెల్లడించిన టైం టేబుల్‌ ప్రకారం పరీక్షలు ఉంటాయని పరీక్షల విభాగం అధికారులు స్పష్టం చేశారు అయితే సోమవారం రాత్రి వరకు విద్యార్థులకు సంబంధించిన హాల్‌టికెట్లు జారీ చేయలేదు. నేడు (మంగళవారం) హాల్‌ టికెట్లు జారీ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

పరీక్షల నిర్వహణకు యాజమాన్యాలు ఓకే..

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని తాము ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటూ పరీక్షలకు సహకరించబోమని ఎక్కువ శాతం ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలు ఫీజులు చెల్లించకుండా మొండికేశాయి. దీంతో రెండుసార్లు డిగ్రీ పరీక్షలు వాయిదా వేశారు. ఫీజులు చెల్లించేందుకు 138 ప్రైవేట్‌ కాలేజీలు ముందుకు రాకపోవడంతో వాటి పేర్లను డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ (దోస్త్‌) వెబ్‌సైట్‌ నుంచి అధికారులు తొలగించారు. అయితే కొన్ని కాలేజీలు పరీక్షల ఫీజులు చెల్లించాయి. సోమవారం ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల యాజమాన్యాల అసోసియేషన్‌ బాధ్యులు హైదరాబాద్‌లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ను కలిసి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయించాలని కోరారని సమాచారం. అయితే తప్పనిసరిగా ఈనెల 14నుంచి డిగ్రీ పరీక్షలు జరుగుతాయని ఫీజులు చెల్లించి పరీక్షలు నిర్వహణకు సహకరించాలని కూడా ఆదేశించారని సమాచారం. దీంతో ఆయా యాజమాన్యాలు ఇక పరీక్షల నిర్వహణకు ఓకే చెప్పాయి.

మొదటి రెండు పరీక్షలు చివరికి

నిర్వహించండి!

పరీక్షల నిర్వహణకు ఒక్కరోజే మిగిలి ఉండడంతో హాల్‌టికెట్ల జారీ, సిట్టింగ్‌ అరెంజ్‌మెంట్‌ ఇబ్బందిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ముందు జరిగే రెండు పరీక్షలు చివరికి నిర్వహించాలని మిగతా పరీక్షలు టైంటేబుల్‌ ప్రకారం నిర్వహించాలని ప్రైవేట్‌ యాజమాన్యాల అసోసియేషన్‌ బాధ్యులు సోమవారం రిజిస్ట్రార్‌ ఆచార్య వి.రామచంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

నేడు హాల్‌ టికెట్ల జారీ

ఫీజులు చెల్లించని మరికొన్ని కాలేజీలు

ఫీజు చెల్లించిన కాలేజీల

విద్యార్థులకే ఎగ్జామ్స్‌

ఒక్కరోజులో ఫీజుల చెల్లింపు

దోస్త్‌ నుంచి పేర్లు తొలగించిన డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు కొందరు ఇటీవల పరీక్షల ఫీజులు చెల్లించగా ఎక్కువ సంఖ్యలో కాలేజీలు సోమవారం ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి పరీక్షల విభాగానికి వాట్సాప్‌లో వివరాలు పంపారు. మరిన్ని కాలేజీలు ఇంకా పరీక్షల ఫీజులు చెల్లించలేదు. మంగళవారం వారు కూడా ఫీజులు చెల్లిస్తారని భావిస్తున్నారు. చెల్లించకపోతే ఆయా కాలేజీల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించబోమని పరీక్షల విభాగం అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement