
సాక్షి, మహబూబాబాద్: మానుకోట పట్టణం జిల్లా కేంద్రంగా మారిని తర్వాత భూములకు లెక్కలొచ్చాయి. దీంతో చుట్టు పక్కల ఉన్న ప్రభుత్వ భూములతో పాటు చెరువులు కబ్జాకు గురయ్యాయి. ముఖ్యంగా చెరువు శిఖం భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఆక్రమణదారులు, రియల్‌ఎస్టేట్ వ్యాపారులకు అధికారులు సహకరించారు. బై నంబర్లతో చెరువులకు పట్టాలు చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. గతంలో కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడంతో.. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో జిల్లా కేంద్రంలోని చెరువుల కబ్జాపై ఉన్నతాధికారులు ఆరా తీస్తుండడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
రాష్ట్ర అధికారులకు ఫిర్యాదులు..
జిల్లా కేంద్రంలో జరుగుతున్న భూ ఆక్రమణలు, ప్రభుత్వ భూముల కబ్జాలు, అందుకు అధికారులు అందిస్తున్న సహకారం మొదలైన వివరాలు తెలుపుతూ జిల్లాకు చెందిన పలువురు రాష్ట్ర ముఖ్యమంత్రి సెల్, సెక్రటేరియట్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. చెరువు మధ్యలో ఉన్న ప్లాట్లకు ఎన్‌ఓసీలు ఇవ్వడం, చెరువులో మట్టిని తొలగించి అమ్ముకోవడం, శిఖం భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి సహకరించడం మొదలైన అంశాలను ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో స్పందించి ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు చెరువుల ఆక్రమణ వివరాలు తెలుసుకొని నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఇరిగేషన్‌శాఖ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. కాస్రా పహాణీలో చెరువుల స్వరూపం, తర్వాత ఆక్రమణ, ఇప్పటి వరకు జారీ చేసిన ఎన్‌ఓసీలు, జారీ చేసిన అధికారుల వివరాలు కూడా సిద్ధం చేయాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఇరిగేషన్, రెవెన్యూశాఖలోని పలువురు అధికారులు హైరానా పడుతున్నారు. అయితే గతంలో జారీ చేసిన ఎన్‌ఓసీలను ఇక్కడి నుంచి బదిలీ అయిన అధికారుల పేరున జారీ చేశారని, ఎన్‌ఓసీ జారీ చేస్తున్నట్లు ఏ రికార్డుల్లో కూడా నమోదు చేయలేదని.. ఇప్పుడు ఎవరిపై చర్య తీసుకుంటారని ఆశాఖలోని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై ప్రస్తుత ఉన్నతాధికారులు కూడా దృష్టి పెట్టాలని, ప్రభుత్వ భూములు, చెరువులను పరిరక్షించేందుకు శాశ్వత ప్రణాళికలు రూపొందించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
రాష్ట్ర అధికారులకు పలువురి ఫిర్యాదు
నివేదిక తయారు చేయాలని ఆదేశాలు
కొనసాగుతున్న కబ్జాల పర్వం
అధికారుల చేతివాటంతో ఎన్‌ఓసీలు
గత కలెక్టర్ ఆదేశించినా..
మానుకోట పట్టణంలోని చెరువులు కబ్జాలపై గత కలెక్టర్ శశాంక దృష్టి పెట్టారు. రెవెన్యూ, నీటిపారుదల, మున్సిపాలిటీ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. పట్టణంలోని బంధం చెరువు, నిజాం చెరువు, కంబాల చెరువు, రాంబంధు చెరువు, జనాల్ చెరువు తదితర చెరువుల వివరాలు, అసలు స్వరూపం, ప్రసుత్త స్వరూపం తేల్చి చెప్పాలని, ఆక్రమణలను గుర్తించాలని, చెరువుల బఫర్ జోన్ వరకు ట్రంచ్‌లు వేయాలని, శిఖం భూముల్లో ఎత్తుగా మట్టిని పోయకుండా నివారించడం, అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లను తొలగించాలని ఆదేశించారు. అయితే కలెక్టర్ ఆదేశాల మేరకు ఒకటి, రెండు రోజుల్లో సర్వేలు నిర్వహించిన అధికారులు తర్వాత ఎక్కడి పని అక్కడే ఆపేసినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడం, అనంతరం కలెక్టర్ శశాంక జిల్లా నుంచి బదిలీ కావడంతో అంతా సమసిపోయింది.