
ఒంట్లో బాలేనపుడు.. మనసుకు ముసురు పట్టినపుడు డాక్టర్లు రకరకాల చికిత్స విధానాలు చెబుతుంటారు.. వాటర్ థెరపీ.. ఫిజియోథెరఫీ. .. ఆయిల్ పుల్లింగ్ .. మడ్ బాత్.. ఇవన్నీ ఒకలాంటి థెరఫీలే.. ఒత్తిడిని దూరం చేసేందుకు యోగా.. ప్రాణాయామం.. ఇలా రకరాలకు ఉంటాయి మరి.. ఎవరివీలును బట్టి వాళ్ళు ఆయా చికిత్సా విధానాలు పాటిస్తారు.. ఇయన్నీ ఒకెత్తు..
ఒక్కోసారి.. మనసుకు ముసురుపడుతుంది.. ఎదురుగా ఏముందో కనిపించదు.. ఏం జరుగుతుందో వినిపించదు.. ఒక్కోసారి జీవితం చాన్నాళ్లుగా మూత విప్పని పచ్చడి బాటిల్ మాదిరి నిల్వ వాసన వస్తుంది.. కరకరలాడాల్సిన బిస్కెట్లు మెత్తబడినట్లు ఫీల్. .. జీవితం అంటే ఉద్యోగం.. వ్యాపారం.. తిండి.. నిద్ర.. అంతే ఉంటుంది.. ఎందుకు బతుకుతున్నామో తెలియదు.. అసలిది ఒక బతుకేనా అనే సందేహం.. జీవితం అనే బండి మనం నడుపుతున్నట్లు వెళ్తుందా.. ఆటో మోడ్ లో పెట్టేస్తే అది తనకు నచ్చినట్లు వెళ్తుందా అనే సందేహం కూడా వస్తుంది. అలాంటపుడు పైన చెప్పిన అన్ని థెరఫీలకన్నా ఈ ట్రావెల్ థెరపీ ఖచ్చితంగా వర్కవుట్ అవుతుంది. దీనికి ఏ డాక్టర్ అక్కర్లేదు.. మనమే ప్రాక్టీస్ చేయొచ్చు.. లేదా తోడుగా ఎవరైనా ఉంటే మంచిదే..
ఇదెలా ప్రాక్టీస్ చేయాలి...
అన్ని రకాల చికిత్సా విధానాల మాదిరిగానే ఈ ట్రావెల్ థెరపీ కూడా ప్రత్యేకంగా మనసుకు ప్రత్యేకం. .. ముసురుపట్టిన మనసుకు దుమ్ము వదిలిస్తుంది... మసకబారిన కళ్ళకు స్పష్టత ఇస్తుంది.. శరీరానికి ఉత్సాహాన్ని.. కిక్కును ఇస్తుంది.. ఇది సాధన చేయడం కూడా సులువే... పెద్దగా ఏం లేదు.. ముందుగా ఏదో ఒక ఊరు.. ఒక లోకేష్ సెలెక్ట్ చేసుకుని ట్రైన్/ బస్సు/ ఫ్లయిట్ టిక్కెట్లు తీసుకుని ఒక జబ్బ సంచిలో రెండు మూడు జతల బట్టలు.. గట్రా గట్రా కుక్కుకుని వెళ్లిపోవడమే. ట్రైన్ వేగంగా ముందుకు దూసుకువెళ్తుంటే మన సమస్యలు.. చికాకులు అదే వేగంతో వెనక్కి వెళ్లిపోతున్నా ఫీలింగ్. .. కో ప్యాసింజర్లను ..వారి నడవడిక.. తీరు .. చూస్తుంటే ఏదో కొత్త విషయం చూస్తున్న భావన... సరికొత్త ప్రదేశాలు చూస్తుంటే ఏదో నేర్చుకుంటున్న ఫీల్.. చిన్నపుడు జాగ్రఫీలో విన్న పేరున్న ఊరికి వెళ్తే అబ్బా నేనూ ఒక సాహసికుడినే అన్న కించిత్ గర్వం.. సోషల్ పుస్తకంలో చదివిన నదిలో మునకేస్తే వయసు హఠాత్తుగా పాతికేళ్ళు తగ్గిపోవడం తథ్యం.
హిస్టరీ మాష్టర్ చెప్పిన చారిత్రక కట్టడాన్ని నేరుగా చూస్తే దాన్ని మనమే కట్టినంత సంబరం... లోకంలో మన ఊరే కాదు.. చాలా ఊళ్ళున్నాయి.. మన చుట్టూరా ఉన్న జనాలే కాదు చాలా మంది ఉన్నారు.. ఈ విషయం నేను కొత్తగా కనిపెట్టాను అనే భావన.. పఠనం.. పయనం .. ఈ రెండూ మనసుకు ఖచ్చితంగా రిలీఫ్ ఇస్తాయి.. అందుకే ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఈ రెండూ మానొద్దు.. డబ్బుల్లేవని చికిత్స మానేయలేం.. డబ్బుల్లేవని ఆస్పత్రికి వెళ్లడం ఆపలేం.. సెలవుల్లేవని చికిత్సను ఆపలేం.. అలాగే డబ్బుల్లేవని ప్రయాణాలు కూడా మానొద్దు.. అప్పుచేసైనా ఆస్పత్రికి ఎలా వెళ్తామో ప్రయాణానికి కూడా వెళ్లాల్సి.. నేను బిజీ అనే భ్రమల్లోంచి రావాలి. .. సెలవుల్లేవు .. నేను బిజీ అనే ఆలోచనలలైన్లను డిలీట్ చేయాలి.. మిత్రులను కలవడం.. వారితో కబుర్లు..ముచ్చట్లు.. ఇవన్నీ మనసుకు ఔషధాలే .. కాదనలేని సత్యం
సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా మరి
అన్ని వైద్యవిధానాలకు ఉన్నట్లే ఈ ట్రావెల్ థెరఫీకి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.. కాకుంటే అవి మన శరీరం నుంచి కాకుండా మన సైడ్ ఉన్న బంధుమిత్రుల నుంచి వస్తాయి.. వీడికి ఇల్లు సంసారం తిన్నగా ఉండదు.. పైగా చేతిలో అప్పులున్నాయి కానీ షికార్లకు లోటుండదురా ... అబ్బా వీడికి మూణ్నెళ్లకు ఒక టూర్ ఉండాల్సిందే... వీడికి తడి తక్కువ.. తమాషా ఎక్కువ.. మమ్మల్ని తీసుకెళ్లచ్చుగా .. ఏదైనా నీలాగా బతకడం కష్టం మామా.. ఇలా రకరకాల కామెంట్ల రూపంలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి .. అలాగని మన పయనం ఆగొద్దు.. ఎవరికీ సమాధానం చెప్పొద్దు.. మెడిసిన్ కూడా అంతేగా... సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదాని మందులు మానేయలేం.. అలాగే మనసుకు థెరఫీ కావాలంటే ప్రయాణాలు చేయాలి.. కాస్త డబ్బుల పరిస్థితి చూసుకుని తరచూ చిన్నదో పెద్దదో టూర్ వేస్తుండాలి.. ఆరోగ్యంగా ఉండాలి..
కొప్పెర గాంధీ
ట్రావెల్ థెరఫిస్ట్