దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక అరుదైన తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని 142వ నిబంధన మేరకు తనకున్న ప్రత్యేక అధికారాలను వినియోగించి మరీ పోక్సో కేసులో నేరస్తుడిగా నిరూపితమైన వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించింది. జైలుశిక్ష రద్దు చేసింది. ఆ వ్యక్తి నేరం చేసిన మాట వాస్తవమైనప్పటికీ తరువాత బాధితురాలిని పెళ్లి చేసుకోవడం.. పుట్టిన బిడ్డతో కలిసి సంసారం కొనసాగిస్తుండటాన్ని పరిగణలోకి తీసుకుని తామీ నిర్ణయానికి వచ్చినట్లు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మెస్సీలతో కూడిన బెంచ్ తీర్పునిచ్చింది.
ఆసక్తికరమైన ఈ కేసు వివరాలు..
తమిళనాడుకు చెందిన కృపాకరన్ అనే వ్యక్తి 2017లో ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. న్యాయ విచారణ అనంతరం న్యాయస్థానం అతడికి ఐపీసీ సెక‌్షన్ 366 (ప్రొటెక‌్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) కింద ఒక నేరానికి ఐదేళ్లు, ఇంకోదానికి పదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఈ తీర్పును కృపాకరన్ మద్రాస్ హైకోర్టులో సవాలు చేశాడు. బాధితురాలిని తాను పెళ్లి చేసుకున్నానని, బిడ్డతో సంతోషంగా ఉన్నామని తెలిపాడు. కానీ 2021 సెప్టెంబరులో హైకోర్టు పిటిషన్ కొట్టేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. కృపాకరన్ చెబుతున్న విషయాలను నిర్ధారించుకునేందుకు సుప్రీంకోర్టు తమిళనాడు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీని పురమాయించింది.
బాధితురాలు కూడా కోర్టు ముందు ఒక అఫిడవిట్ దాఖలు చేస్తూ... తాను కృపాకరన్‌పై ఆధారపడ్డానని, అతడితోనే సంసారం చేయాలని తీర్మానించుకున్నానని స్పష్టం చేసింది. బాధితురాలి తండ్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుప్రీంకోర్టు విచారణకు హాజరవడమే కాకుండా... కృపాకరన్ నేరాన్ని, శిక్షను రద్దు చేయడంపై తనకు ఎలాంటి అభ్యంతరమూ లేదని స్పష్టం చేశారు. తమిళనాడు లీగల్ సెల్ అథారిటీ ఉన్నతాధికారి కూడా కృపాకరన్, బాధితురాలు సుఖంగానే ఉన్నారని, సంసారం బాగానే గడుస్తోందన్న నివేదిక అందడంతో భార్యపిల్లలను బాగా చూసుకోవాలని, ఏ రకమైన ఇబ్బంది పెట్టినా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ సుప్రీంకోర్టు అతడి నేరాన్ని, శిక్ష రెండింటినీ రద్దు చేసింది.
సామాజిక సంక్షేమం కోసమే..
కృపాకరన్ కేసు తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ‘‘చట్టాలనేవి సామాజిక సంక్షేమం కోసమే’’ అన్న జస్టిస్ బెంజిమన్ కార్డోజో (అమెరికా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి) వ్యాఖ్యతోనే తీర్పును ప్రారంభించడం విశేషం. కృపాకరన్ చేసింది తీవ్రమైన నేరమే అయినప్పటికీ ఆ తరువాత జరిగిన పరిణామాలను, వాటి ప్రత్యేకతలను దృష్టిలో ఉంచుకుని తాము ఈ తీర్పునిస్తున్నట్లు స్పష్టం చేసింది. మైనర్ బాలికలపై లైంగిక దాడులను నిరోధించేందుకే పోక్సో లాంటి చట్టాలను రూపొందించారని, శిక్షలను ఖరారు చేశారని తెలిపింది.
అయితే, ఈ శిక్షలను యథాతథంగా అమలు చేసే ముందు వాస్తవిక పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. అన్నింటికీ ఒకేతీరున కాకుండా.. ఆయ కేసులను బట్టి ఈ న్యాయస్థానం తీర్పులు ఇస్తుందని తెలిపింది. అవసరమైన సందర్భాల్లో కఠినంగానే కాకుండా.. కరుణతోనూ తీర్పులుంటాయని న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మెసీల ధర్మాసనం వివరించింది. కృపాకరన్ కేసులో నేరం జరిగింది కామంతో కాకుండా ప్రేమతో అన్న అంచనాకు రావడం వల్ల తాము రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ప్రత్యేక అధికారాలతో అతడి నేరాన్ని, శిక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
- గిళియారు గోపాలకృష్ణ మయ్యా.


