కూటమిలో కుంపట్లు | - | Sakshi
Sakshi News home page

కూటమిలో కుంపట్లు

Oct 13 2026 1:59 AM | Updated on Oct 13 2026 1:59 AM

పచ్చపార్టీలో పతాకస్థాయికి వర్గ పోరు

● కర్నూలులో మంత్రి టీజీ భరత్‌ వర్సెస్‌ విష్ణు

● కోడూమూరులో విష్ణు, కోట్ల వర్గానికి మధ్య వర్గ విభేదాలు

● ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డికి అసమ్మతి సెగ

● మంత్రాలయంలో రాఘవేంద్రారెడ్డి వర్సెస్‌ తిక్కారెడ్డి

● ఆదోనిలో భగ్గుమంటున్న పార్థసారథి, మీనాక్షి నాయుడు వర్గాలు

● ఆలూరులో వైకుంఠం జ్యోతి ఒంటెద్దు పోకడ

● పత్తికొండలో ఎమ్మెల్యే కేఈ శ్యాంకుమార్‌పై తీవ్ర అసంతృప్తి

సాక్షి ప్రతినిధి, కర్నూలు: స్థానిక ఎన్నికల వేళ అధికార టీడీపీలో వర్గ విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. మంత్రి టీజీ భరత్‌ ఇతర ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలకు మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మంత్రితో చాలామంది ఎమ్మెల్యేలకు పొసగడంలేదు. ఇక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు రెండవశ్రేణి నేతలకు మధ్య సమన్వయం కొరవడింది. కొన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. దీంతో కేడర్‌ సైతం వర్గాలుగా విడిపోయింది. ఈ ఎన్నికల్లో ఏ వర్గానికి టికెట్‌ ఇచ్చినా మరో వర్గం సహకరించే పరిస్థితి కానరావడం లేదు.

● కర్నూలు నియోజకవర్గంలో మంత్రి టీజీ భరత్‌, కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌ విష్ణువర్థన్‌రెడ్డి వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. కర్నూలు నగరంలో కేఈ కృష్ణమూర్తి తనయుడు పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంకుమార్‌కు మంత్రి టీజీ భరత్‌కు పడటం లేదన్న ప్రచారం ఉంది. మరోవైపు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, బైరెడ్డి రాజశేఖరరెడ్డి వర్గాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

● కోడుమూరులో విష్ణువర్థన్‌రెడ్డి హవా కొనసాగిస్తుండగా ఇక్కడ పచ్చపార్టీ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి డమ్మీగా మారినట్లు ప్రచారం ఉంది. ఇది అటు దళితవర్గాల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతోంది. విష్ణు తీరుతో పచ్చనేతలు, కార్యకర్తలకు గుర్తింపు లేకుండా పోయిందని టీడీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రాంతంలోని తుంగభద్ర, హంద్రీ నదుల నుంచి కొందరు నేతలే ఇసుక అక్రమ రవాణా చేస్తుండడంతో కేడర్‌లో విష్ణుపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. మరోవైపు డోన్‌ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి సొంత గ్రామం కోడుమూరు మండలం కావడంతో వారికి ఈ మండలంలో ఇప్పటికీ మంచిపట్టు ఉంది. పట్టు కోల్పోకుండా విష్ణు ప్రాబల్యం తగ్గించేందుకు కోట్ల వర్గం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

● మంత్రాలయంలో టీడీపీ ఇన్‌చార్జి రాఘవేంద్రారెడ్డి, టీడీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డిల మధ్య పచ్చిగడ్డివేస్తే భగ్గుమంటోంది. నేతలు, కిందిస్థాయి పార్టీ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయి గొడవ పడుతున్నారు. స్థానిక ఎన్నికల్లో కలిసి పనిచేసే పరిస్థితి కానరావడంలేదు.

● ఆలూరులో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వైకుంఠం జ్యోతి ఒంటెద్దు పోకడ పచ్చపార్టీలో అగ్గి రాజేసింది. ఆమె వ్యవహార శైలి మరింత వివాదాస్పదమవుతోంది. గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిన వీరభద్రగౌడ్‌ వర్గాన్ని జ్యోతి దూరంపెట్టారు. ఈ ప్రాంతంలో ఉన్నతాధికారిగా ఉన్న ఒక పోలీసు ఉన్నతాధికారిని అడ్డం పెట్టుకొని ఆమె పోలీసులపైనే పెత్తనం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సొంత పార్టీ కేడర్‌పైనే కేసులు పెట్టించిన సందర్భాలు అనేకం. దీంతో ఇక్కడ పచ్చపార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. కోట్ల సూజాత పుట్టిన హాలహర్వి మండలం ఈ నియోజకవర్గంలోనే ఉండడంతో కోట్లవర్గం సైతం ఉంది. వారికి వైకుంఠం జ్యోతితో విభేదాలు ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement