రైతుల కన్నీళ్లు ప్రభుత్వానికి కనిపించవా? | - | Sakshi
Sakshi News home page

రైతుల కన్నీళ్లు ప్రభుత్వానికి కనిపించవా?

Sep 17 2026 1:44 AM | Updated on Sep 17 2026 1:44 AM

వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి

ఓర్వకల్లు: చేతికందే సమయంలో చెరకు పంట దగ్ధం కావడం.. నీరందక మరోవైపు పంటలు ఎండిపోవడం.. రైతుల కన్నీళ్లు ప్రభుత్వానికి కనిపించవా? అని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ప్రశ్నించారు. రైతుల కష్టాలను తెలుసుకోవడానికి క్షేత్రస్థాయికి వెళ్లాలని సూచించారు. గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టడంతో కాలిపోయిన కేతవరం మాజీ సర్పంచ్‌ బోయ గోవర్ధన్‌ చెరకు తోటను బుధవారం కాటసాని పరిశీలించారు. బాధిత రైతును పరామర్శించారు. మొత్తం ఐదు ఎకరాల్లో రూ.2 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని, క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాధిత రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిష్పక్షపాతంగా విచారించి రైతుకు న్యాయం చేయాలన్నారు. కేతవరం గ్రామానికి చెందిన మరో రైతు సాగు చేసిన మొక్కజొన్న పంటను కాటసాని పరిశీలించారు. ఎండిపోయిన బోర్ల పరిస్థితిపై రైతులతో మాట్లాడారు. నీరందక ఉల్లి పంటలో తీవ్రంగా నష్టపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

నష్టపోయిన ప్రతి రైతుకూ

పరిహారం ఇవ్వాలి

రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదని కాటసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తక్షణమే స్పందించి, సమగ్ర సర్వే చేసి నష్టపోయిన ప్రతి రైతును గుర్తించాలన్నారు. బాధిత రైతులకు వెంటనే తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. మాజీ సర్పంచ్‌ గోవర్ధన్‌, రైతులు కృష్ణారెడ్డి, ఘనాపురం మద్దిలేటి, బోయ కృష్ణ, గూడూరు శ్రీనివాసులు, అహ్మద్‌ ఉశేన్‌, కలాం, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement