● తుంగభద్ర నుంచి నీటిని తెప్పించలేరా?
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి
కర్నూలు (టౌన్): కేసీ కెనాల్‌లో గోడలు నిర్మించి నీటిని నిల్వ చేసి నిమజ్జనం చేయడం ఏమిటని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కర్నూలులోని వినాయకఘాట్ వద్ద కెసీ కెనాల్‌లో గోడ కట్టిన ప్రాంతాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. అపరిశుభ్రంగా ఉన్న నీరు, భారీగా డంప్ అయిన గుర్రపు డెక్కను పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమజ్జనం కోసం చేస్తున్న ఏర్పాట్లపై మండి పడ్డారు. ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్‌కు ఉందన్నారు. తుంగభద్ర నుంచి నీటిని తెప్పించకుండా హడావుడి పనులు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
ప్రజలు క్షమించరు
వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా కర్నూలులోని కేసీ కెనాల్ వద్ద లక్షలాది మంది భక్తులు కనిపిస్తారని, తూతూ మంత్రంగా పనులు చేస్తే వారు క్షమించబోరని ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. సంస్కృతిని గౌరవిస్తూ వినాయక నిమజ్జనం జురుపుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. తుంగభద్ర నుంచి కర్నూలుకు రావాల్సిన 4.4 టీఎంసీల నీటి వాటాను తెప్పించాలన్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రత్యే చొరవ తీసుకోవాలన్నారు. కర్నూలు కేసీలో కాకుండా ఉల్లిందకొండ, తడకనపల్లె, నన్నూరు టోల్ ప్లాజా అంటూ చెప్పడం మంత్రి బాధ్యతారాహిత్యమన్నారు. ఇప్పటికయిన మంత్రి, అధికార యంత్రాంగం తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


