అంతర్‌రాష్ట్ర మహిళా దొంగ అరెస్టు
● సీసీ ఫుటేజీ ద్వారా కేసులను ఛేదించిన పోలీసులు
కర్నూలు: పిల్లల చదువుల దృష్ట్యా తల్లి దొంగగా మారి పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. రద్దీగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మహిళల హ్యాండ్ బ్యాగుల నుంచి బంగారు ఆభరణాలను చోరీ చేసిన నంద్యాల జిల్లా సిద్ధాపురం గ్రామానికి చెందిన అంతర్ రాష్ట్ర మహిళా దొంగ వాణిశ్రీ అలియాస్ వాణిని పోలీసులు పక్కా ఆధారాలతో అరెస్టు చేసి 30 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేసి ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎదుట హాజరుపరిచారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో డీఎస్పీ కేవీ రాఘవేంద్ర, సీఐలు శేషయ్య, విక్రమసింహ తదితరులతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలు వెల్లడించారు.
మంత్రాలయం ఆరాధనోత్సవాల సందర్భంగా..
పది రోజుల క్రితం తిరుపతికి చెందిన ఓ మహిళ అనంతపురంలో వివాహ కార్యక్రమానికి హాజరై అనంతరం మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామి మఠానికి దర్శనం కోసం వెళ్లారు. ఆరాధనోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని గుర్తు తెలియని మహిళ బ్యాగు జిప్‌ను తెరి చి అందులోని సుమారు 24 తులాల బంగారు ఆభరణాలను అపహరించింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసు లు సీసీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. వాటి ఆధారంగా వాణిశ్రీని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీకి పాల్పడినట్లు అంగీకరించింది. బస్సుల రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ప్రయాణికులకు తెలియకుండా ఆభరణాలు అపహరించిన మరో మూడు చోరీ కేసులు త్రీటౌన్, ఫోర్త్‌టౌన్, పాణ్యం పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన మొత్తం చోరీ కేసుల్లో ఆమె ప్రమేయం ఉన్నట్లు విచారణలో బయ టపడింది. నిందితురాలి వద్ద నుంచి మొత్తం 30 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
వెంకాయపల్లెలో నివాసం
10వ తరగతి వరకు చదువుకున్న వాణిశ్రీ పిల్లల చదువు కోసం కర్నూలు శివారులోని వెంకాయపల్లె వద్ద అద్దె ఇంట్లో నివాసముంటోంది. తరచూ సొంతూరు సిద్ధాపురానికి వెళ్లి వస్తూ బంధువుల సహకారంతో దొంగగా మారింది. ఈమె భర్త గోపి గౌడ్ ప్రస్తుతం వాటర్ ప్లాంట్‌లో పనిచేస్తున్నాడు. ఈమె తల్లి కూడా నందికొట్కూరు రోడ్డులోని ఓ కాలనీలో సొంతిల్లు నిర్మించుకుని అక్కడే నివాసముంటోంది. ఈమె తమ్ముడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఈమెకు ఇద్దరు పిల్లలు సంతానం. ఒకరు ఏడో తరగతి, మరొకరు ఐదో తరగతి చదువుతున్నారు. భర్త జీతంపై వచ్చే ఆదాయం చాలక దొంగగా మారింది. ఈమైపె ఉత్తరప్రదేశ్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం యాచారం ప్రాంతంలో చోరీ కేసులు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామానికి చెందిన ఈడిగ రాజేష్, నంద్యాల జిల్లా దొర్నిపాడు గ్రామానికి చెందిన జక్కుల శారదా దేవికి సంబంధించిన నగలు కూడా తస్కరించినట్లు నిందితురాలు అంగీకరించింది. అతి తక్కువ సమయంలో సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితురాలిని గుర్తించి ఆమె వద్ద నుంచి 30 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేసినందుకు క్రైం పార్టీ పోలీసులు ఎస్పీ అభినందించారు.


