అనాలోచిత నిర్ణయంపై ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

అనాలోచిత నిర్ణయంపై ఆగ్రహం

Sep 17 2026 1:44 AM | Updated on Sep 17 2026 1:44 AM

సాధువులు, సన్యాసులు, భిక్షువులు క్షేత్రాన్ని విడిచి వెళ్లాలనడం తగదు

ఈ నిర్ణయం తీసుకున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి

ఈ నెల 23వ తేదీలోపు నిర్ణయం ఉపసంహరించుకోకుంటే నిరసనలు

శ్రీశైలంటెంపుల్‌: సనాతన ధర్మం, హిందూ సమాజం, దేవదాయశాఖ నిబంధనలపై అవగాహన లేని శ్రీశైల దేవస్థాన ఉన్నతాధికారి అనాలోచిత నిర్ణయాలు సాధువులు, సన్యాసులకు శాపంగా మారాయని శ్రీశైలం సాధు భవన్‌ ట్రస్ట్‌ విమర్శించింది. ఈ మేరకు బుధవారం దేవస్థాన పరిపాలన భవనంలో ఈఓ శ్రీనివాసరావును ఏపీ సాధు పరిషత్‌ గౌరవాధ్యక్షుడు అట్లూరి నారాయణరావు, అధ్యక్షుడు శ్రీనివాసనంద సరస్వతి స్వామిజీ, ప్రధాన కార్యదర్శి అరవింద స్వామిజీ, స్థానిక అశ్రమాల పీఠాధిపతులు, నిర్వాహకులు, సాధువులు కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. దేశం నలుమూలల నుంచి సాధుసంతులు, జ్ఞానులు, పుణ్యపురుషులు, భిక్షువులు, అవధూతలు, సిద్దులు, గురువులు, అశ్రమ పీఠాధిపతులు శ్రీశైల మహాక్షేత్రానికి అనునిత్యం తరలివస్తుంటారని, వారి వలన క్షేత్రానికి ఎలాంటి నష్టం జరదన్నారు. శ్రీశైలంలో ఉంటున్న సాధువులు, సన్యాసులను క్షేత్రానికి 250 కి.మీ దూరంలో వదిలిపెట్టాలని గత నెల 19న ప్రకటించిన నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ అనాలోచిత నిర్ణయం తీసుకున్న అధికారులను తక్షణమే విధుల నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సనాతన ధర్మం, శ్రీశైలక్షేత్ర మహిమ గురించి తెలియకుండా ఎలా విధులు నిర్వహిస్తారని ప్రశ్నించారు. దీనిపై ఈ నెల 23వ తేదీలోపు ఈఓ శ్రీనివాసరావు తగు నిర్ణయాన్ని మీడియా పూర్వకంగా వెల్లడించాలని లేని పక్షంలో ఈ నెల 23న ట్రస్ట్‌బోర్డు మీటింగ్‌ పురస్కరించుకుని ఆంధ్ర–తెలంగాణ సాధు సంతులు, ఆశ్రమాల స్వామిజీలతో కలిసి శ్రీశైల దేవస్థాన ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ను కలిసి వినతిపత్రం సమర్పిస్తామని, అప్పటికి పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త అందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. అంతకుముందు వీరంతా శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement