కాల్పుల ఘటనపై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

కాల్పుల ఘటనపై కేసు నమోదు

Jul 28 2026 1:06 AM | Updated on Jul 28 2026 1:06 AM

కర్నూలు: నగర శివారులోని జొహరాపురం రోడ్డులోని వీఆర్‌ఎన్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కౌశిక్‌ కాల్పులు జరిపిన ఘటనపై ప్రత్యక్ష సాక్షి మద్దెల విజయరాజు ఫిర్యాదు మేరకు మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో కర్నూలు శ్రీకృష్ణ కాలనీకి చెందిన కౌశిక్‌ టీమ్‌ ఓడిపోయింది. దీనిని జీర్ణించుకోలేని కౌశిక్‌ తన లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌తో మూడు రౌండ్లు కాల్పులు జరపడం కలకలం రేగింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని కౌశిక్‌తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకుని సంఘటనపై విచారణ జరిపారు. బ్యాడ్మింటన్‌ పోటీల్లో తమ జట్టు ఓడిపోయినందుకు మనస్తాపానికి గురై కాల్పులు జరిపినట్లు దర్యాప్తులో వెల్లడైందని మూడో పట్టణ సీఐ శేషయ్య తెలిపారు. కౌశిక్‌ లైసెన్స్‌ రివాల్వర్‌తో పాటు తూటాలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు పంపినట్లు ఆయన వెల్లడించారు. ప్రాణరక్షణ కోసం కొన్నేళ్ల క్రితం కౌశిక్‌ రివాల్వర్‌ లైసెన్స్‌ పొందాడని, దాని రద్దు కోసం ఎస్పీ ద్వారా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపనున్నట్లు ఆయన వెల్లడించారు.

పోలీస్‌ ట్రాకర్‌ డాగ్‌

రాఖీ మృతి

కర్నూలు: జిల్లా పోలీసు శాఖలో 2017 నుంచి సుమారు 9 సంవత్సరాల పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో విశేష సేవలందించిన రాఖీ వృద్ధాప్య సమస్యలతో ఆదివారం సాయంత్రం కర్నూలు స్పెషల్‌ బ్రాంచ్‌ కార్యాలయ సమీపంలోని డాగ్‌ స్క్వాడ్‌ కార్యాలయంలో మృతిచెందింది. సోమవారం మధ్యాహ్నం కర్నూలు శివారు దిన్నెదేవరపాడు సమీపంలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో రాఖీ కళేబరానికి ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ కృష్ణమోహన్‌ ఆధ్వర్యంలో డాగ్‌స్క్వాడ్‌ సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. లాబ్రడార్‌ జాతికి చెందిన మగ ట్రాకర్‌ డాగ్‌ అయిన రాఖీ డాగ్‌స్క్వాడ్‌లో పనిచేసిన కాలంలో దొంగతనాలు, హత్య కేసులతో పాటు పలు నేరాల దర్యాప్తులో కీలకపాత్ర పోషించి పోలీసు శాఖకు విశేష సేవలు అందించింది. పోలీస్‌ ట్రాకర్‌ డాగ్‌ జిల్లాకు వచ్చినప్పటినుంచి డాగ్‌ హ్యాండ్లర్‌గా హెడ్‌ కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌ ఉన్నారు. కార్యక్రమంలో అడ్మిన్‌ ఆర్‌ఐ జావేద్‌, ఆర్‌ఎస్‌ఐలు, డాగ్‌స్క్వాడ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిందితులకు జైలు శిక్ష

డోన్‌ టౌన్‌: పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ముగ్గురు వ్యక్తులకు జైలు శిక్ష పడింది. పట్టణ సీఐ ఇంతియాజ్‌ బాషా తెలిపిన వివరాల మేరకు. కృష్ణగిరి మండలం కటారుకొండ గ్రామానికి చెందిన మద్దిలేటి, కర్నూలుకు చెందిన షేక్‌ ఖలీల్‌, ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన వి.వీరేష్‌ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టణ పోలీసులకు చిక్కారు. వీరిపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా మొదటి ఇద్దరికి రెండు రోజులు జైలు శిక్ష, వీరేష్‌కు రూ.10వేల జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తూ స్పెషల్‌ జ్యూడీషియల్‌ సెకెండ్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఎస్‌.నూరుల్లా తీర్పు వెలువరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపై వారిపై పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించేది లేదని హెచ్చరించారు. పట్టణ ఎస్‌ఐలు శరత్‌కుమార్‌రెడ్డి, నరేంద్రకుమార్‌, పోలీసు సిబ్బంది ఉన్నారు.

● డోన్‌ రూరల్‌ స్టేషన్‌ పరిధిలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో పట్టుబడిన పట్టణంలోని చిగురమానుపేటకు చెందిన హుస్సేన్‌ సాహెబ్‌ను కోర్టులో ప్రవేశ పెట్టగా జడ్జి విచారణ చేసి రూ.10వేల జరిమానా విధించినట్లు సీఐ సీఎం రాకేష్‌ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ మమత పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

కొత్తపల్లి: బైకు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు, ఓ విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. వీరాపురం గ్రామానికి చెందిన రంజిత్‌ కుమార్‌ ఆటోలో ఎర్రమఠం వైపు నుంచి కొత్తపల్లి వైపు వస్తున్నాడు. అదే సమయంలో శివపురం గూడెంకు చెందిన సురేష్‌ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి అయిన శివశంకర్‌ను ఎక్కించుకుని పెద్దగుమ్మడాపురం నుంచి ముసలిమడుగు వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ముసలిమడుగు గ్రామ సమీపంలోని నీలగిరి చెట్ల ప్రాంతలో ప్రమాదవశాత్తూ బైకు, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో సురేష్‌, శివశంకర్‌ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స అందించి కర్నూలుకు రెఫర్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement