శాకంబరీగా చౌడేశ్వరిదేవి
బనగానపల్లె రూరల్: నందవరం చౌడేశ్వరిదేవి ఆలయంలో శాకంబరీదేవి మహోత్సవాలు సోమవారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, పాలక మండలి ఆధ్వర్యంలో ఈ వేడుకలు చేపట్టారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ఆకుకూరలు, వివిధ రకాల కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన నిర్వహించగా.. సాయంత్రం కలశస్థాపన, సహస్రనామార్చన, అంకురార్పణ, పల్లకీసేవ, మహామంగళహారతి ఇచ్చారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శాకాంబరీదేవి రూపంలో ఉన్న చౌడేశ్వరిదేవిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వేదపండితులు తెలిపారు. ఈ వేడుకలు మరో రెండు రోజుల పాటు కొనసాగుతాయని వెల్లడించారు.
మహానంది: ఆషాఢమాసం పురస్కరించుకుని మహానంది క్షేత్రంలో శాకంబరీ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు సోమవారం శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారు ఆకుకూరల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, అర్చకులు ఉదయం నుంచి విశేష పూజలు నిర్వహించారు. స్థానిక మహిళలు శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న సింహ మండపంలో శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేశారు. లోక కల్యాణం కోసం విశేష పూజలు నిర్వహించినట్లు వేదపండితులు రవిశంకర అవధాని తెలిపారు. రెండో రోజు మంగళవారం వివిధ రకాల ఫలాలతో కామేశ్వరీదేవికి అలంకరణ ఉంటుందన్నారు.
తొలిరోజు ఆకుకూరల
అలంకారంలో
శ్రీ కామేశ్వరీదేవి
నేడు ఫలాలతో
అమ్మవారికి అలంకరణ


