కర్నూలు(సెంట్రల్): పోలీసు కానిస్టేబుల్, ఎస్‌ఐ నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనపై ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో దాదాపు 5 గంటలపాటు నిరసనను హోరెత్తించారు. సోమవారం డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో వేలాది మంది నిరుద్యోగులు బిర్లా గేటు నుంచి కలెక్టరేట్ వరకు ఎస్‌ఐ, పోలీసు కానిస్టేబుల్ నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉదయం 11 గంటల సమయంలో మెయిన్ గేటు దగ్గర బైఠాయించి కలెక్టరేట్ దిగ్భంధానికి దిగారు. అయితే కొంతసేపటి తరువాత కలెక్టర్, జేసీలలో ఒకరు వచ్చి తమ వినతిపత్రాన్ని తీసుకొని ప్రభుత్వానికి పంపితే నిరసన కార్యక్రమాన్ని విరమిస్తామని పోలీసులకు చెప్పారు. ఈ క్రమంలో త్రీటౌన్ పోలీసులు నిరుద్యోగుల విన్నపాన్ని డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఆమె అందుకు ఒప్పుకోలేదు. కలెక్టర్, జేసీలు పీజీఆర్‌ఎస్‌లో ఉన్నారని, వారిలో కొందరిని అక్కడే తీసుకురావాలని సూచించారు. అందుకు నిరుద్యోగులు ఒప్పుకోలేదు. కచ్చితంగా కలెక్టర్, జేసీలలో ఒకరు తమ వద్దకు రావాల్సిందేనని పట్టుబట్టారు. ఈనేపథ్యంలో పోలీసులు విషయాన్ని డీఆర్వో దృష్టికి తీసుకెళ్లారు. అందుకు ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెళ్లేది లేదు..ఎవరి కోసం..ఎంత సేపు ధర్నా చేసుకుంటారో చేసుకోమని చెప్పారు. దీంతో నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఉన్నతాధికారుల తీరును నిరసిస్తూ మెయిన్ రోడ్డులో రాస్తారోకోకు దిగారు. 2గంటలకు పీజీఆర్‌ఎస్ పూర్తి అవుతుందని, అప్పుడు అధికారులు వస్తారని చెప్పడంతో తిరిగి నిరుద్యోగులు మెయిన్ గేట్ దగ్గరకు వచ్చి నిరసనకు దిగారు. చెప్పిన సమయానికి కలెక్టర్, జేసీలు రాకపోగా..వారి వెనుక గేటు నుంచి వెళ్లిపోవడంతో నిరుద్యోగులు కోపోద్రిక్తులయ్యారు. ఈ క్రమంలో మళ్లీ మధ్యాహ్నం 3గంటల సమయంలో మరోసారి మెయిన్ రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో చేపట్టారు. ఈక్రమంలో చివరికి కలెక్టర్ నిరుద్యోగులను 4 గంటల సమయంలో తన కార్యాలయానికి పిలిపించుకొని వినతిపత్రం తీసుకోవడంతో కలెక్టరేట్ దిగ్గంధం ముగిసింది. ఇదిలా ఉంటే నిరుద్యోగులు కలెక్టరేట్ ముట్టడితో పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు రెండు సార్లు పెద్దాసుపత్రి సర్కిల్‌లో రాస్తారోకోతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
వినతిపత్రం తీసుకోవడానికి
నిరాకరించిన ఉన్నతాధికారులు
ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఐదు
గంటల పాటు కలెక్టరేట్ దిగ్బంధం
చివరికి దిగివచ్చిన కలెక్టర్


