లోకేష్‌ పర్యటన.. కూటమికి పరీక్ష! | - | Sakshi
Sakshi News home page

లోకేష్‌ పర్యటన.. కూటమికి పరీక్ష!

Jul 28 2026 1:06 AM | Updated on Jul 28 2026 1:06 AM

ఓ వైపు ఆదోని జిల్లా సాధన ఉద్యమం..మరోవైపు డీఎస్సీ అవకతవకలపై ఆందోళనలు

ఆదోని: రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ బుధవారం ఆదోని పర్యటనకు రానున్న నేపథ్యంలో పట్టణంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తుండగా మరోవైపు ప్రత్యేక జిల్లా సాధన కోసం నిరసనల హోరు సాగుతోంది. ఇదే సమయంలో పెద్దహరివాణం ఆదినారాయణ రెడ్డి 100 గంటల నిరవధిక రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈనేపథ్యంలో పోలీసులు, ఇంటెలిజెన్స్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. లోకేష్‌కు నిరసన సెగ తగలకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇన్‌చార్జ్‌ డీఎస్‌పీ పిలుస్తున్నారు స్టేషన్‌కు రావాల్సిందిగా టూ టౌన్‌ పోలీసుల నుంచి జిల్లా సాధన జేఏసీ నాయకులకు పిలుపు వచ్చింది. అయితే, ఇందుకు భయపడాల్సిన అవసరం లేదని, అవసరమైతే ధర్నా చేయడానికి లేదా అరెస్టు కావడానికి కూడా సిద్ధంగా ఉందామంటూ జేఏసీ నాయకులు, సభ్యులు వాట్సాప్‌ల ద్వారా ఒకరికొకరు మెసేజ్‌లను పంపించుకుంటున్నారు. మంత్రి లోకేష్‌ దృష్టికి జిల్లా సాధన అంశాన్ని తీసుకెళ్లేందుకు ఉద్యమకారులకు అవకాశం ఇస్తారా? లేక అరెస్టులు చేస్తారా అనే చర్చ జరుగుతోంది. కొన్ని నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎమ్మిగనూరు పర్యటనకు వచ్చినప్పుడు కూడా జేఏసీ నాయకులకు ఆయనను కలిసే అవకాశం ఇవ్వలేదు. మరోవైపు డీఎస్సీ–2026 నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపడంతో పాటు విద్యాశాఖ మంత్రి నారాలోకేష్‌ తక్షణమే రాజీనా మా చేయాలని ప్రతిపక్షాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. కేంద్రంలో నీట్‌ ప్రశ్నాపత్రాల లీకేజి ఉదంతంపై విద్యార్థుల పోరాటానికి తలొగ్గి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ తన పదవికి రాజీనామా చేశారని, అదే రీతిలో రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ లోకేష్‌ రాజీనామా చేయాలంటూ గళం వినిపించేందుకు కొన్ని విద్యార్థి సంఘాలు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో లోకేష్‌ పర్యటన విజయవంతంమవుతుందో లేదో అనే భయం ఆ పార్టీ నాయకుల్లో నెలకొంది.

29, 30 తేదీల్లో విద్యాశాఖమంత్రి లోకేష్‌ పర్యటన

కర్నూలు (సెంట్రల్‌): మానవ వనరుల అభివృద్ధి (విద్య) శాఖ మంత్రి నారా లోకేష్‌ ఈనెల 29, 30 తేదీల్లో కర్నూలు జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్‌ ఎ.సిరి తెలిపారు. సోమవారం సునయన ఆడిటోరియంలో ఆమె మాట్లాడుతూ...29వ తేదీన ఆదోనిలో, 30వ తేదీన పత్తికొండలో మంత్రి పర్యటన ఉంటుందని, అధికారులు ఆయా ప్రాంతాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలను మంత్రి సందర్శించే అవకాశం ఉందని విద్యాశాఖాధికారులకు చెప్పారు. పత్తికొండ మండలం హోసూరులో సోలార్‌ ప్రాజెక్టుకు మంత్రి భూమి పూజ చేస్తారని వెల్లడించారు.

పెరుగుతున్న లోకేష్‌

రాజీనామా డిమాండ్‌

జేఏసీ నాయకుల అరెస్టుకు

రంగం సిద్ధం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement