బేతంచెర్ల: బలపాలపల్లె గ్రామంలో కుటుంబ సమస్యలతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామనికి చెందిన రవికుమార్, తిరుమలమ్మ (27) దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆదివారం రాత్రి భర్త ఆలస్యంగా ఇంటికి రావడంతో తిరుమలమ్మ గొడవ పడింది. సోమవారం వారి మధ్య ఇదే విషయంపై వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఆమె విష ద్రావణం తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలి అన్న మద్దయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్ బాబు తెలిపారు.
పైళ్లెన 18 రోజుల్లోనే..
ఆదోని సెంట్రల్: పట్టణానికి చెందిన యువకుడు ఆదివారం రాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసు హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని ఇంద్రానగర్‌కు చెందిన లక్ష్మన్న కుమారుడు ఉపేంద్ర ఆదివారం రాత్రి ఆదోని–నగరూర్ రైల్వేస్టేషన్ల మధ్యన ఉన్న అప్‌లైన్ ట్రాక్‌పై ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు కో పైలెట్ అందించిన సమాచారం మేరకు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా ఉపేంద్ర తీవ్ర గాయాలతో మృతి చెంది ఉన్నాడు. మృతుడికి ఈనెల 9వ తేదీన అదే కాలనీకి చెందిన యువతితో వివాహమైంది. అయితే, ఈ పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో తేలిందని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.
ప్రతి చెట్టుకు క్యూఆర్ కోడ్
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వ విద్యాలయంలోని ప్రతి వృక్షాన్ని, దానికి సంబంధించిన వివరాలను డిజిటలైజేషన్ చేసి క్యూఆర్ కోడ్‌తో అనుసంధానం చేస్తున్నారు. ఇది రాష్ట్రంలోనే ఒక వినూత్న కార్యక్రమమని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వి.వెంకటబసవరావు అన్నారు. వర్సిటీ బోటనీ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థుల అకడమిక్ ప్రాజెక్ట్‌గా రూపొందించిన ‘రాయలసీమ యూనివర్సిటీ వృక్ష సంపద యొక్క క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ గుర్తింపు’ కార్యక్రమాన్ని సోమవారం వీసీ ప్రారంభించి మాట్లాడారు. వర్సిటీ ప్రాంగణంలోని 82 రకాల వృక్షజాతులను శాసీ్త్రయంగా గుర్తించి వాటి చిత్రాలు, బెరడు, ఆకులు, పుష్పాలు, పండ్లు, శాసీ్త్రయ నామం, సంరక్షణ స్థితి, ఔషధ, ఆర్థిక ప్రాముఖ్యత తదితర వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ప్రొఫెసన్ ఎన్‌టీకే నాయక్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ విజయకుమార్ నాయుడు, వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.విశ్వనాథరెడ్డి, డీన్ ఆఫ్ అకడమిక్ అఫైర్స్ ఆచార్య సీవీ కృష్ణారెడ్డి, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పీవీ సుందరానంద్, డీన్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఆచార్య భరత్ కుమార్, బోటనీ విభాగ కో ఆర్డినేటర్ డాక్టర్ రంగనాయకులు పాల్గొన్నారు.


