కర్నూలు(హాస్పిటల్): ఇల్లు, పొలాల్లో కలుపును తొలగించేందుకు వాడే పారాక్వాట్ అనే గడ్డిమందు విష రసాయనంగా మారింది. అది కలుపు తీయడంలో కంటే మనిషి ప్రాణాలు తీయడంలో ముందుంటోంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబసమస్యలు వంటివి తలెత్తినప్పుడు క్షణికావేశంలో కొందరు వ్యవసాయ కూలీలు, రైతులు తదితరులు ఈ మందును తాగేస్తున్నారు. కొన్ని గంటల్లోనే అది వారి ప్రాణాలను తీసేస్తోంది. దీంతో కొన్ని సంవత్సరాల క్రితమే పలు దేశాల్లో, రాష్ట్రాల్లో పారాక్వాట్‌ను నిషేధించినా మన రాష్ట్రంలో యథేచ్ఛగా లభించేది.
పెద్దాసుపత్రికి అధికంగా కేసులు
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువాలిటికి ప్రతి నెలా 250 నుంచి 300 వరకు వివిధ విష రసాయనాలు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స కోసం వస్తుంటారు. అందులో 10 శాతానికి పైగానే పారాక్వాట్(గడ్డిమందు) కేసులు ఉంటున్నాయి. ఈ మేరకు గత 2024 సంవత్సరంలో 39 మంది, 2025 లో 34 మంది, ఈ యేడాది ఇప్పటి వరకు 12 మంది పారాక్వాట్ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స కోసం వచ్చారు. ఈ మందు తాగిన వారిలో ఉమ్మడి కర్నూలు జిల్లాలతో పాటు అనంతపురం, వైఎస్‌ఆర్ కడప, అనంతపురం జిల్లాలు, తెలంగాణా జిల్లాల నుంచి సైతం రోగులు వస్తున్నారు. ఈ ఆసుపత్రితో పాటు నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు, ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీలకు, ప్రముఖ ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు నేరుగా వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. ఈ మందును తీసుకున్న వారిలో 99 శాతం మరణిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ఈ మందుకు విరుగుడు లేకపోవడమే కారణమని వారు పేర్కొంటున్నారు.
ప్రాణాలు తీసే కటిక విషం
ఈ గడ్డిమందును కొందరు ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు వాడుతుండగా, మరికొందరు పొలాల్లో పిచికారీ చేస్తున్న సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల దానిని పీల్చి అస్వస్థతకు గురవుతున్నారు. ఇలాంటి గాలిని పీల్చడం ద్వారా అది ఊపిరితిత్తుల్లోకి వెళ్లి నాశనం చేస్తుంది. వైద్య పరిభాషలో దీనిని పారాక్విడ్ లంగ్ అని పేర్కొంటారు. ఈ రసాయనం చర్మంపై పడటం, కంటి ద్వారా కూడా శరీరంలోకి వెళ్తుంది. కలుషితమైన నీరు, ఆహార పదార్థాల తీసుకోవడం వల్ల, గాలి ద్వారా కూడా ఈ రసాయనం శరీరంలోకి ప్రవేశిస్తోంది. అధికంగా రైతులు, వ్యవసాయ కూలీలు, నిరక్షరాస్యులు క్షణికావేశంలో ఈ విషరసాయనాన్ని తీసుకుంటున్నారు. తీసుకున్న కొన్ని సెకన్లలోనే ఆ మందు శరీరంలోని కీలక అవయాలపై తీవ్ర ప్రభావం చూపి ప్రాణాలు తీస్తుందని వైద్యులు చెబుతున్నారు.
నిషేధించిన కేంద్రం
ఇంతటి ప్రభావం చూపిస్తున్న ఈ గడ్డిమందును అభివృద్ధి చెందిన 32 దేశాల్లోనూ, గడ్డిమందు జన్మస్థానమైన స్విట్జర్లాండ్‌లోనూ నిషేధించారు. కానీ దీనిని కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో విచ్చలవిడిగా వాడుతున్నారు. ఫర్టిలైజర్ దుకాణాల్లోనూ విరివిగా విక్రయిస్తున్నారు. దీని ప్రభావం వల్ల కలుగుతున్న నష్టాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దీనిని పూర్తిగా నిషేధించింది. అన్ని రాష్ట్రాలు దీనిని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. దీంతో మన రాష్ట్రంలోనూ ఆరు నెలల పాటు దీనిపై నిషేధం విధించారు. అయినా, కూడా ఇప్పటికీ పలు దుకాణాల్లో దీనిని యథేచ్ఛగా విక్రయిస్తున్నారు.
పారాక్వాట్ అనే గడ్డిమందును తాగడం, తాకడం, దీని గాలిని పీల్చడం వల్ల ప్రభావానికి గురై చాలా మంది చికిత్స కోసం ఆసుపత్రికి వస్తున్నారు. వాస్తవంగా ఈ మందుకు విరుగుడు లేదు. బాధితుల ఆరోగ్య లక్షణాలను బట్టి వారికి వైద్యం అందిస్తాము. అయినా, పెద్దగా ప్రయోజనం ఉండదు. దీనిని తీసుకున్న వారు, ప్రభావానికి గురైన వారు 95 శాతం మరణించే అవకాశమే ఎక్కువ. దీనిని తాగిన కొన్ని నిమిషాల్లోనే గుండె, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. ఈ పరిస్థితుల్లో కొందరికి డయాలసిస్, మరికొందరికి వెంటిలేటర్ అవసరం పడుతుంది.
–డాక్టర్ రామశివనాయక్, ఎమర్జెన్సీ మెడిసిన్ ఇన్‌చార్జ్ హెచ్‌వోడీ, జీజీహెచ్, కర్నూలు
ప్రాణాలు తీస్తున్న గడ్డిమందు
కలుపు కంటే ఆత్మహత్యలకే
ఎక్కువగా వినియోగం
ఏటా జిల్లాలో వంద మందికి పైగా
ఆత్మహత్య
పారాక్వాట్ (గడ్డి మందు)ను
నిషేధించిన కేంద్రం
అయినా, కొనసాగుతున్న విక్రయాలు
బండి ఆత్మకూరు మండలానికి చెందిన ఓ మహిళ ఈ నెల 25వ తేదీన గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుని మరణించింది. చికిత్స నిమిత్తం ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించినా ఫలితం లేకుండా పోయింది.
కర్నూలు మెడికల్ కాలేజికి చెందిన ఓ వైద్యవిద్యార్థిని గతేడాది ఇదే గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆమెను బతికించుకునేందుకు తల్లిదండ్రులు పలు ఆసుపత్రులు తిరిగి నెలరోజులు పోరాడినా ఫలితం లేకుండాపోయింది.


