మలకల కుంట కబ్జా | - | Sakshi
Sakshi News home page

మలకల కుంట కబ్జా

May 30 2026 3:02 AM | Updated on May 30 2026 3:02 AM

రూ.3 కోట్ల విలువైన స్థలంపై రియల్‌ వ్యాపారి కన్ను

అధికార పార్టీ అండదండలతో దర్జాగా ఆక్రమణ

తెరవెనక ఓ రెవెన్యూ అధికారి?

చర్యలు తీసుకుంటాం

పత్తికొండ:కూటమి ప్రభుత్వంలో చెరువులు, వాగులు, వంకలు కనుమరుగు అవుతున్నాయి. ఓ వైపు తెలుగు తమ్ముళ్లు మట్టి, ఇసుక తవ్వకాలు.. మరో వైపు దర్జాగా కబ్జాలు. అధికార పార్టీ నేతల అండదండలతో ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు రాత్రికిరాత్రే ఆక్రమించేస్తున్నారు. పత్తికొండ పట్టణంలోని బైపాస్‌ రహదారి పక్కన ఉన్న మలకులకుంటలోని సర్వేనంబర్‌ 203–3లో 2.83 ఎకరాలను వంక పోరంబోకు భూమి లో ఓ రియల్‌ ఏస్టేట్‌ వ్యాపారి రెండు రోజుల క్రితం ముళ్లకంపలను తొలగించి చదును చేయించాడు. అయితే సమీప పొలాలు రైతులు, ఎస్సీ కాలనీవాసులు అక్కడికి చేరుకోని నిలదీసినా వారినే దబాయించాడు. పట్దాదారు పాసు పుస్తకం చూపి పనులు చేయాలని గట్టిగా అడగటంతో అక్కడి నుంచి వెళ్లిపో యాడు. ఈ భూమిని గత ప్రభుత్వంలో అధికారులు జగనన్న కాలనీకి కేటాయించగా.. మలకులకుంటకు వానకాలంలో నీరు వస్తే దాదాపు వెయ్యి ఎకరాలకు సంబంధించిన బోరుబావుల్లో భూగర్భ జలాలు పెరిగి పంటలు సాగుకు ప్రయోజనకరంగా ఉంటుందని, అక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వద్దని రైతులు కోరారు. అప్పటి ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి చొరవతో అధికారులు జగనన్న కాలనీ కోసం మరో చోట భూమి కేటాయించా రు.ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ భూమిపై రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కన్ను పడింది. బెంగళూరు–మంత్రాల యం ప్రధాన రహదారి పక్కన ఉండటం వల్ల దాదాపు రూ. 3 కోట్లు పైగా విలువ చేస్తోంది. బైపాస్‌ రహదారి పక్కన ఉండటం వల్ల ప్లాటు వేసి విక్రయించేందుకు భూమి అనుకూలంగా ఉంది. దీంతో అధికార పార్టీ నాయకుల అండదండలు, రెవెన్యూ అధికారుల సహకారంతో ఈ భూమిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడు. పట్టపగలు యథేఛ్చగా భూములను కబ్జా చేస్తున్న రెవెన్యూ అధికారులు నోరు మెదపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. వచ్చే వారంలో పత్తికొండ పట్టణ పరిసరాల్లో భూముల రీసర్వే కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈలోగా వంక పోరంబోకు స్థలాన్ని చదును చేసి ఉంచితే నకలీ పాసు పుస్తకం ద్వారా నేరుగా అడంగల్‌లో పేర్లు నమోదు చేసుకునేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఇదంతా ఓ రెవెన్యూ అధికారి కనుసన్నల్లోనే జరుగుతుందని సమాచారం.

వంక పోరంబోకు భూమిలో ముళ్లకంప చెట్లును తొలగించిన దృశ్యం

మొద్దునిద్రలో మైనర్‌ఇరిగేషన్‌ అధికారులు

చెరువులు, కుంటలు యథేచ్ఛగా కబ్జా అవుతున్నా మైనర్‌ ఇరిగేషన్‌ శాఖ అధికారులు మాత్రం మొద్ద నిద్ర వీడటం లేదు. ములకులకుంటతో పాటు పత్తికొండ పెద్ద చెరువు కింద కడుగొమ్మ వంక ప్రాంతంలో పదుల ఎకరాల్లో భూమి కబ్జాకు గురై నేడు వంక ఆనవాలు లేకుండా చేసినా కూడా పట్టించుకోవడం లేదు. వానకాలంలో వంకకు వరద వస్తే అక్రమార్కులు కబ్జాల వల్ల కడుగొమ్మ వంక పరిసర ప్రాంతాల్లో దాదాపు బుడగజంగాల కాలనీ, నాయిబ్రాహ్మణ కాలనీ, వీకె ఆదినారాయణరెడ్డి కాలనీల్లో దాదాపు 500 ఇళ్లు ముంపునకు గురై అవకాశం ఉంది. ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నా మైనర్‌ ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

మలకుల కుంటలో ముళ్లకంపలను తొలగించిన విషయం మా దృష్టికి వచ్చింది. ఈ విషయంపై ఆర్డీఓతో చర్చించి విచారణ చేపడతాం. కబ్జాకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. వంక పోరంబోకు భూములపై ప్రభుత్వ హక్కులు ఉంటాయి తప్పా డీ పట్టాలు తీసుకున్న వారికి ఎలాంటి హక్కులు ఉండవు.

– హుస్సేన్‌సాహెబ్‌, తహసీల్దార్‌, పత్తికొండ

Advertisement
 
Advertisement
Advertisement