కర్నూలు(హాస్పిటల్): ‘చూడండి సార్..! పారిశుద్ధ్యంలో తక్కువ మార్కులు ఇస్తున్నారు. దీనివల్ల సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మేము చెబితే వినడం లేదు. మీరైనా గట్టిగా చెప్పండి’ అంటూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల అధికారులపై పద్మావతి శానిటేషన్ ఏజెన్సీ నిర్వాహకులు మంత్రి టీజీ భరత్‌కు ఫిర్యాదు చేశారు. బుధవారం ఆసుపత్రి అభివృద్ధి పనులపై కర్నూలు మెడికల్ కాలేజీలోని కౌన్సిల్ హాల్‌లో మంత్రి టీజీ భరత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనుల గురించి చర్చించారు. చివరగా పద్మావతి శానిటేషన్ ఏజెన్సీ నిర్వాహకులు లేచి పై విధంగా ఫిర్యాదు చేశారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు సమాధానమిస్తూ తాము మార్కులు మరీ తక్కువేమీ వేయడం లేదని, 94 వేశామన్నారు. దీనికి నిర్వాహకులు కలుగజేసుకుంటూ 94 వేస్తే ఎలా? కనీసం 95 వేస్తే పూర్తిగా డబ్బులు వస్తాయని బదులిచ్చారు. మంత్రి కలుగజేసుకుంటూ మార్కులు తక్కువ వేస్తే వారికి నష్టం వస్తుంది కదా? చూసి వేయండి అంటూ బదులిచ్చారు. దీనికి సూపరింటెండెంట్ కలుగజేసుకుంటూ 94 మార్కులు వేస్తే వారికి కొద్ది శాతం మాత్రమే కోత పడుతుందని, వారు చెబుతున్నట్లుగా పూర్తిగా డబ్బులు రాకుండా పోవన్నారు. పైగా ఆసుపత్రిలో పారిశుద్ధ్యం బాగాలేదని, స్వయంగా తాము తనిఖీలకు వెళ్లినప్పుడు పరిశీలనలో వెల్లడైందన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు, పారిశుద్ధ్య ఏజెన్సీ నిర్వాహకుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. చివరగా మంత్రి స్పందిస్తూ అధికారులు సూచించినట్లు తప్పులు సరిచేసుకుంటే మార్కులు పూర్తిస్థాయిలో పడతాయి. ఆ విధంగా నడుచుకోవాలని చెప్పి వెళ్లిపోయారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ లక్ష్మిబాయి, అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రవీణ్, సాయిప్రదీప్, స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ సీఎస్‌కే ప్రకాష్, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ చిరంజీవులు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ వై.కామేశ్వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో మంత్రి అనుచరులు
ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించి నిర్వహించిన అధికారిక సమావేశంలో అధిక సంఖ్యలో మంత్రి టీజీ భరత్ అనుచరులు హాజరుకావడం విమర్శలకు తావిస్తోంది. సమావేశానికి వచ్చిన అధికారులు, వైద్యుల కంటే అనుచరులే అధిక సంఖ్యలో సీట్లలో ఆశీనులయ్యారు. పైగా చర్చ జరుగుతున్నంత సేపు కొందరు ముఖ్య అనుచరులు అధికారులను ప్రశ్నించడం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. తాము ఇలాంటి సమావేశం ఎప్పు డూ చూడలేని ఓ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు.
మార్చురీలో వర్కర్ల నియామకానికి గ్రీన్‌సిగ్నల్
ప్రభుత్వాసుపత్రి మార్చురీపై ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనాలను మంత్రి టీజీ భరత్ వద్ద అధికారులు ప్రస్తావించారు. అనధికారింగా 15 ఏళ్ల నుంచి ఎలా పనిచేయించుకుంటున్నారని, ఇప్పుడు వారిని అక్కడ నుంచి తీసేస్తే పని కష్టం అవుతుంది కదా అని ప్రశ్నించారు. కాబట్టి వారిని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. వారిని ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులుగా చేర్చుకుని మార్చురీలో పనిచేయించుకోవాలన్నారు. అనంతరం వారు ప్రజల నుంచి డబ్బులు తీసుకోకుండా చూడాలని చెప్పారు.
మంత్రి టీజీ భరత్ ముందు
అధికారులను నిలదీసిన పద్మావతి
శానిటేషన్ ఏజెన్సీ నిర్వాహకులు
పారిశుద్ధ్యం బాగా లేకపోతే ఎలా వేయాలని బదులిచ్చిన అధికారులు
వాడీవేడిగా ప్రభుత్వ సర్వజన
వైద్యశాల అభివృద్ధి కమిటీ
సమావేశం


