ఉల్లి డీహైడ్రేషన్‌ యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు | - | Sakshi
Sakshi News home page

ఉల్లి డీహైడ్రేషన్‌ యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు

May 13 2026 1:20 AM | Updated on May 13 2026 1:20 AM

కర్నూలు(సెంట్రల్‌): జిల్లాలో వచ్చే మంగళవారం నాటికి ఉల్లి డీహైడ్రేషన్‌ యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి ఉద్యాన, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, మెప్మా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో ఉల్లి సాగు, ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుపై కలెక్టర్‌ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉల్లి సాగులో దిగుబడిని పెంచడానికి నాణ్యమైన విత్తనాలను నాటడం, సీడ్‌ డ్రిల్లర్‌ యంత్రాలను సబ్సిడీపై రైతులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఉద్యాన శాఖాధికారులను ఆదేశించారు. సమావేశఃలో ఉద్యాన శాఖాధికారి రాజాకృష్ణారెడ్డి, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, మెప్మా పీడీ శ్రీనివాసులు పాల్గొన్నారు.

17న కురువ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

కర్నూలు(అర్బన్‌): కురువ విద్యార్థులకు ప్రతిభా పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 17న ఉదయం 10 గంటలకు పెద్దపాడు రోడ్డులోని ఏపీ మోడల్‌ స్కూల్‌ పక్కనున్న శ్రీ భీర లింగేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కురువ సంఘం ప్రధాన కార్యదర్శి ఎంకే రంగస్వామి తెలిపారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులను విద్యాపరంగా మరింత ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు పెద్ద సంఖ్యలో కురువ సామాజిక వర్గ ప్రజలు హాజరు కావాలని కోరారు. సమావేశంలో సంఘం అసోసియేట్‌ అధ్యక్షులు గుడిసె శివన్న, ఉపాధ్యక్షులు ధనుంజయ, కోశాధికారి కేసీ నాగన్న తదితరులు పాల్గొన్నారు.

ఏపీ పీఆర్‌ రాష్ట్ర అసోసియేషన్‌లో జిల్లాకు చోటు

కర్నూలు(అర్బన్‌): ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గంలో జిల్లాకు చోటు లభించింది. ఇటీవల గుంటూరు జిల్లా పరిషత్‌ సమావేశ భవనంలో అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ ఎన్నికలు నిర్వహించి, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యవర్గంలో కర్నూలు పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఆర్‌.మధు వెంకటేశ్వరరావును రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా, జిల్లా పరిషత్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఆర్‌బీవీ కృష్ణారావును రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచాలి

సి.బెళగల్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలను పెంచాలని ఉపాధ్యాయులకు డీఈఓ సుధాకర్‌ సూచించారు. మండల విద్యాశాఖ అధికారులు జ్యోతి, ఆదామ్‌బాషా ఆధ్వర్యంలో మంగళవారం పొలకల్‌లో బడిపిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. డిప్యూటీ ఈఓ శ్రీధర్‌బాబుతో కలిసి డీఈఓ తనిఖీ చేశారు. అనంతరం స్థానిక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో రెమిడియల్‌ తరగతులను తనిఖీ చేసి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. హెచ్‌ఎంలు తిమ్మన్న, వరలక్ష్మమ్మ, మునిస్వామి, సీఆర్పీలు పాల్గొన్నారు.

వడదెబ్బతో వ్యక్తి మృతి

పాములపాడు: వడదెబ్బతో కోల్స్‌ ఆనందాపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ విజయానందం(54) మృతి చెందాడు. సోమవారం ఉదయం ఉపాధి పనులకు, మొక్కజొన్న మిషన్‌ పనులకు వెళ్లి ఎండలు ఎక్కువగా ఉండటంతో అస్వస్థతకు గురై మంగళవారం తెల్లవారు జామున మృతి చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement