ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో ఆదివారం క్వింటా వేరుశనగ గరిష్టంగా రూ.7,200 ధర పలికింది. మార్కెట్‌కు 115 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులు మాత్రమే మార్కెట్‌కు విక్రయానికి వచ్చాయి. దీంతో క్వింటా వేరుశనగ కనిష్ట ధర రూ.5,540కు, మధ్యస్థ ధర క్వింటం రూ,6,713 ప్రకారం వ్యాపారులు కొనుగోలు చేసినట్లు మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. అదేవిధంగా ఆముదాలు 42 క్వింటాళ్లు విక్రయానికి రావడంతో కనిష్ట ధర క్వింటా రూ.5,880లు. మధ్యస్థ రూ.5,890, గరిష్టంగా ధర రూ.5,901కు, కందులు 2 క్వింటాళ్లు అమ్మకానికి రావడంతో క్వింటా గరిష్ట ధర రూ.6,430కు వ్యాపారులు కొనుగోలు చేశారు.
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులతో వెట్టిచాకిరి
కర్నూలు(సెంట్రల్): అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం వెట్టిచాకిరి చేయించుకుంటోందని స్టేట్ గవర్నమెంట్ అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గంటా సంపత్‌కుమార్, ఈడుపుగంటి మోహన్‌రావు ఆరోపించారు. ఆదివారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా వారు మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. అవుట్‌సోర్సింగ్ పేరుతో నెలకు రూ.10 వేల జీతం ఇస్తూ శ్రమదోపిడీ చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పదవీ విరమణ వయసును 62 సంత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని కోరారు. అసోసియేషన్ కర్నూలు జిల్లా కమిటీకి జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా నాగరాజు, జనరల్ సెక్రటరీగా రాములు, ట్రేజరర్‌గా శివప్రసాద్ ఎన్నికయ్యారు.
నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నా
కర్నూలు(సెంట్రల్): తుంగభద్ర, హంద్రీ నదులను, వక్కెరవాగును పరిరక్షించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక కన్వీనర్ రామకృష్ణారెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు జెడ్పీ నుంచి కలెక్టరేట్ వరకు రాల్యీగా వస్తామని పేర్కొన్నారు. కర్నూలు నగరానికి శాశ్వతంగా నీటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే తుంగభద్ర, హంద్రీ నదులను పరిరక్షించాలని, ధర్నాలో ప్రజలు పాల్గొనాలని కోరారు.
అధికారిక వైబ్‌సైట్‌ను మాత్రమే వినియోగించాలి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో ఆర్జిత సేవా టికెట్లు, స్పర్శదర్శనం టికెట్లు, వసతి గదులు ముందస్తు బుకింగ్ కోసం దేవస్థాన అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే వినియోగించుకోవాలని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఈఓ మాట్లాడుతూ శ్రీశైల దేవస్థానంలోని ఉభయ దేవాలయాల్లో అన్నీ ఆర్జిత సేవలు, మల్లికార్జున స్వామివారి స్పర్శదర్శన టికెట్లను ఆన్‌లైన్ ద్వారా పొందే అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. 17 ఆర్జిత సేవలకు సంబంధించిన సేవాటికెట్లను ఆన్‌లైన్ ద్వారా భక్తులు పొందవచ్చన్నారు. అలాగే వసతిని కూడా ముందస్తుగా ఆన్‌లైన్‌లో రిజర్వ్ చేసుకునే అవకాశం కల్పించబడిందన్నారు. భక్తులు రాష్ట్ర దేవదాయశాఖ అధికారిక వైబ్‌సైట్ www.aptemples.ap.gov.in, అలాగే దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ www. srisailadevasthanam.org ద్వారా మాత్రమే వినియోగించుకోవాలని అన్నారు. అలాగే మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా అన్నీ ఆర్జిత సేవా టికెట్లను, మల్లన్న స్పర్శదర్శనం, శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం టికెట్లను పొందవచ్చునని అన్నారు.


