రూ.100 కోట్ల ఆర్‌ అండ్‌ బి స్థలంలో టీడీపీ కార్యాలయమా? | - | Sakshi
Sakshi News home page

రూ.100 కోట్ల ఆర్‌ అండ్‌ బి స్థలంలో టీడీపీ కార్యాలయమా?

May 7 2026 8:08 AM | Updated on May 7 2026 8:08 AM

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్‌ రెడ్డి

కర్నూలు(టౌన్‌): నగరంలోని సి.క్యాంపు ప్రాంతంలో రూ.100 కోట్ల విలువ చేసే 2 ఎకరాల ఆర్‌ అండ్‌ బి స్థలంలో టీడీపీ కార్యాలయం నిర్మించడమేంటని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్‌ రెడ్డి ఽప్రశ్నించారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే గాయత్రి ఎస్టేట్‌లో కార్యాలయం ఉందని, మళ్లీ రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలంలో మరో కార్యాలయం అవసరమేంటన్నారు. ఆర్‌ అండ్‌ బి స్థలంలో ప్రస్తుతం అక్కడ ఉన్న వారిని తరలించి హడావుడిగా భూమి పూజ చేయడం అమానుషమన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను కూల్చి పార్టీ కార్యాలయాలను నిర్మించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. పార్టీ పేరుతో ఆర్‌ అండ్‌ బి స్థలంలో షాపులు నిర్మించి అద్దెకు ఇవ్వాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. 100 సంవత్సరాల పురాతన వృక్షాలను తొలగించడం పర్యావరణాన్ని హరించడమేనన్నారు. ఎంతో విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వమే వాటినే రాజకీయ ప్రయోజనాలకు వినియోగించడం దారుణమన్నారు.

వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని

అడ్డుకోలేదా?

ఆర్‌ఎస్‌ రోడ్డు సమీపంలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న నిరుపయోగ స్థలంలో ఆనాడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని నిర్మించతలపెట్టిందన్నారు. అయితే అప్పట్లో టీడీపీ నేతలు నానా యాగీ చేశారన్నారు. ఎన్నో అడ్డంకులు సృష్టించారన్నారు. 90 శాతం పనులు పూర్తయి, హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ భవన నిర్మాణాన్ని టీడీపీ నేతలు అడ్డుకోలేదా అని ప్రశ్నించారు. అనాడు వైఎస్సార్‌సీపీ కార్యాలయ భవనం విషయంలో ఇబ్బందులు సృష్టించినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పార్టీ పేరు చెప్పి షాపులు నిర్మించుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లేదని గుర్తు చేశారు. ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement