ఉదయం 9.30 గంటలకే పీజీఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

ఉదయం 9.30 గంటలకే పీజీఆర్‌ఎస్‌

Apr 27 2026 8:12 AM | Updated on Apr 27 2026 8:12 AM

కర్నూలు(హాస్పిటల్‌): కలెక్టరేట్‌లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక ఉదయం 9.30 గంటలకే ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా జిల్లా, డివిజన్‌, మండల స్థాయిల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం 9.30 గంటలకు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌

కర్నూలు: నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్‌ అధికారులు జిల్లా అంతటా రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. జిల్లాలో నాలుగు పోలీస్‌ సబ్‌ డివిజన్లు, 39 పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లను ఆదివారం స్టేషన్‌కు రప్పించి వారి నేర చరిత్ర వివరాలను ఆరా తీసి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. చెడు నడత కలిగిన వ్యక్తులను తీవ్రంగా హెచ్చరించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. పోలీస్‌ సూచనలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వేణుమాధవా..!

వైభవంగా నారసింహుడి

జయంతి బ్రహ్మోత్సవాలు

ఆళ్లగడ్డ: అహోబిలేశుడి జయంతి బ్రహ్మోత్సవాలు పరవశంగా కొనసాగుతున్నాయి. భక్తుల గోవిందా నామస్మరణలతో ఎగువ అహోబిల క్షేత్రం మారుమోగుతోంది. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ జ్వాలా నరసింహస్వామి వేణుగోపాల స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున నిత్య పూజల్లో భాగంగా సుప్రతభాత సేవతో స్వామిని మేలుకొలిపిన అనంతరం అర్చనలు, అభిషేకాలు నిర్వహించి జ్వాలా నరసింహుడిని వేణుగాపాలస్వామి అలంకారంలోను శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను రుక్మిణి, సత్యభామలుగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం ఉభయ దేవేరులతో ఉత్సవ పల్లకీని అధిరోహించిన నరసింహస్వామి మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. రాత్రి స్వామి వారు పొన్నచెట్టు వాహనం అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు.

శ్రీగిరికి పోటెత్తిన భక్తులు

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకున్నారు. వేకువ జామున పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి క్యూ లైన్లలో బారులు దీరారు. క్యూ లైన్లలో వేచివున్న భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement