గడ్డకట్టని రక్తం! | - | Sakshi
Sakshi News home page

గడ్డకట్టని రక్తం!

Apr 27 2026 7:30 AM | Updated on Apr 27 2026 7:30 AM

జీజీహెచ్‌లో బాధితులకు ఉచిత వైద్యం

కర్నూలు(హాస్పిటల్‌): సాధారణంగా ఎవ్వరికై నా దెబ్బతగిలి రక్తగాయమైతే వెంటనే రక్తస్రావం జరుగుతుంది. కాసేపు అదిమి పట్టుకుంటే రక్తస్రావం ఆగిపోతుంది. కానీ హిమోఫీలియా జబ్బుతో బాధపడే వారికి గాయమైందంటే రక్తస్రావం ఆగదు. నిరంతరంగా రక్తస్రావం సాగుతూనే ఉంటుంది. ఇలాంటి బాధితుల సంఖ్య జిల్లాలో పెరుగుతోంది. రక్తస్రావం అధికం కావడంతో బాధితుల వ్యథ అంతా ఇంతా కాదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో హిమోఫీలియాతో బాధపడే వారి సంఖ్య 135 వరకు ఉంటుంది. ఒక్క కర్నూలు జిల్లాలోనే 90 మందికి పైగా బాధితులు ఉన్నారు. ఈ వ్యాధి బాధితుల బాధలు విన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చాక నెలకు రూ.10వేల ప్రత్యేక పింఛన్‌ ఇచ్చి ఆసరా కల్పించారు. అప్పటి నుంచి ఈ బాధితులు ప్రతి నెలా ఠంఛనుగా పింఛన్‌ తీసుకోవడం వల్ల వారి ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తీరుతున్నాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన ఈ ప్రత్యేక పింఛన్‌ను ప్రస్తుత ప్రభుత్వం సైతం తీసివేయలేని పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వంలో కూడా ప్రతి నెలా పింఛన్‌ను బాధితులు అందుకుంటున్నారు.

హిమోఫీలియా అంటే...

హిమోఫిలియా అనేది అరుదైన జబ్బు. ఇది జన్యుపరంగా కుటుంబ సభ్యులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధిలో రక్తం గడ్డకట్టే ప్రొటీన్లు (గడ్డకట్టే కారకాలు) తగినంత ఉండవు. ఈ కారణంతో వారికి ఏదైనా గాయమైతే రక్తస్రావం ఆగకుండా జరుగుతుంది. చిన్నగాయమైనా సరే రక్తస్రావం ఆగదు. అయితే కొందరిలో ఎలాంటి గాయాలు లేకున్నా అంతర్గతంగా కూడా రక్తస్రావం అవుతుంది. దీనిని బ్లీడర్స్‌ డిసీస్‌ అని కూడా పేర్కొంటారు.

అధికంగా మగపిల్లలే బాధితులు

జన్యుపర వ్యాధి అయిన హిమెఫిలియా సాధారణంగా వారసత్వంగా వస్తుంది. ముఖ్యంగా ఇది ఎక్కువగా ప్రధానంగా మగపిల్లల్లో కనిపిస్తుంది. ఈ వ్యాధిలో జన్యువు ఎక్స్‌ క్రోమోజోముపై ఉంటుంది. ఇది తల్లివాహకంగా పనిచేస్తుంది.

వ్యాధికి కారణాలు

సాధారణంగా ప్రతి మనిషి శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థలో రక్తం గడ్డకట్టేందుకు కోయాగ్యులేషన్‌ ఫ్యాక్టర్స్‌ అనే రసాయనాలు ఉంటాయి. హిమోఫిలియా బాధితుల్లో మాత్రం ఇలాంటివి ఉండవు. ఇవే ఫ్యాక్టర్‌ 8, ఫ్యాక్టర్‌ 9. రక్తస్రావ సమయంలో ఈ ఫ్యాక్టర్స్‌లో ఏది కోల్పోతే దానిని తిరిగి రోగికి ఎక్కించాల్సి ఉంటుంది.

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల విభాగంలో హిమోఫీలియా బాఽధితులకు అవసరమైన చికిత్సను ఉచితంగా అందిస్తున్నాము. వారికి అవసరమైన పరీక్షలతో పాటు చికిత్స, మందులను ఉచితంగా ఇస్తున్నాము. జిల్లా సత్వర చికిత్స కేంద్రం(డైస్‌)లో ప్రత్యేకంగా ఐసీహెచ్‌హెచ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ జనరల్‌ ఫిజీషియన్‌తో పాటు చిన్నపిల్లల వైద్యులూ ఉన్నారు. బాధిత చిన్నారులకు అవసరమైన పరీక్షలు, కౌన్సిలింగ్‌ వారు అందిస్తారు. –డాక్టర్‌ విజయానందబాబు, హెచ్‌ఓడీ, చిన్నపిల్లల విభాగం, జీజీహెచ్‌, కర్నూలు

వేధిస్తోన్న అరుదైన

హిమోఫీలియా జబ్బు

ఉమ్మడి జిల్లాలో

135 మంది బాధితులు

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో

ప్రత్యేక చికిత్స కేంద్రం

పెద్దాసుపత్రిలో ప్రత్యేక కేంద్రం

ఇంటిగ్రేటెడ్‌ సెంటర్‌ ఫర్‌ హిమోగ్లోబినోపతీస్‌, హిమోఫిలియా(ఐసీహెచ్‌హెచ్‌) టెస్టింగ్‌ అండ్‌ ట్రీట్‌మెంట్‌ సెంటర్‌లను 2020లో గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం విశాఖపట్టణం, ఈస్ట్‌గోదావరి, గుంటూరుతో పాటు కర్నూలులోనూ ఏర్పాటు చేసింది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మాతాశిశు కేంద్రం పక్కనున్న జిల్లా సత్వర చికిత్స కేంద్రం (డైస్‌)లో ఇది కొనసాగుతోంది. ఇక్కడ తలసీమియాతో పాటు సికిల్‌సెల్‌, హిమోఫిలియా బాధితులకు చికిత్స అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement