కోసిగి: రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు ఎంపికై నట్లు బీచ్ కబడ్డీ జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మురళి, కార్యదర్శి వలకలదిన్నె వెంకటేష్ తెలిపారు. ఆదోని నేషనల్ స్కూల్‌లో ఆదివారం జరిగిన ఎంపిక పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 60 మంది క్రీడకారులు హాజరైయారన్నారు. ఇందుల్లో ప్రతిభ కనబరిచిన రాష్ట్రస్థాయికి 6 మంది పురుషులను, ఆరుగురు మహిళా క్రీడాకారులను ఎంపిక చేశామన్నారు. ఎంపికై న వారు మే 7 నుంచి 10 తేదీ వరకు నెల్లూరు జిల్లాలో జరిగే 13వ రాష్ట్రస్థాయిలో బీచ్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారన్నారు.
దేశ అభివృద్ధిలో జనగణన కీలక పాత్ర
కర్నూలు (టౌన్): దేశ అభివృద్దిలో జనగణన కీలక పాత్ర పొషిస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. ఆదివారం స్థానిక పాతబస్టాండ్ కొండారెడ్డి బురుజు నుంచి కలెక్టరేట్ వరకు 5 కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేష్ కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. స్వీయ జనగణనలో ప్రజలు తమ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలన్నారు. జనగణన సిబ్బంది ఫోన్ నంబర్ తప్ప ఇతర వివరాలు, ఓటీపీలు అడగబోరని, వేలిముద్రలు, ఐరిస్ సేకరించరని తెలిపారు. ప్రజలు సందేహాల నివృత్తి కోసం 1855 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. ఈనెల 30వ తేదీ వరకు స్వీయ జనగణనకు అవకాశం ఉందన్నారు. నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేష్ మాట్లాడుతూ.. మే 1 నుంచి ఇంటింటా జనగణన సర్వే ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేస్తే సమయం ఆదా అవుతుందన్నారు. ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు ఎస్‌ఈఐడీ నంబర్ చూపించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ చిరంజీవి, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, సెన్సస్ ఇంచార్జీ ఎస్. ఇజ్రాయేలు, ఎస్‌ఈ రమణ మూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ రఘ. డిఎస్ డీవో భూపతిరావు పాల్గొన్నారు. అనంతరం 5 కే రన్‌లో విజేతలకు రూ. 5 వేలు,. రూ. 3 వేలు, రూ. 2 వేలు నగదు బహుమతులు అందజేశారు.
ఆకుమల్లలో అ‘పూర్వ’ సమ్మేళనం
సంజామల: వారంతా చిన్నపిల్లలైపోయారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి అనుభవాలను నెమరువేసుకున్నారు. ఫొటోలు, సెల్ఫీలతో సందడిగా గడిపారు. ఆకుమల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002–2003 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వివిధ హోదాల్లో పలు ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా పాఠశాల వేదికగా కలుసుకున్నారు. ప్రధాన ఉపాధ్యాయులు పుల్లారెడ్డి, ఉపాధ్యాయులు ప్రసాద్‌బాబురావ్, రామసుబ్బారెడ్డి, శ్రీనివాసయాదవ్, ప్రశాంత్ రెడ్డి, వెంకటస్వామి, దామోదర్, లక్ష్మిదేవి, శ్రీనివాసరెడ్డిని సన్మానించి, వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థులు జి. నాగరాజు, వై. నాగరాజు, రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి, మధుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. చార్టెడ్ అకౌంటెంట్ మల్లికార్జున రెడ్డి, ఆకుమల్ల ఉపసర్పంచ్ హజీపీరన్, వీఆర్‌ఓ రాజ్యలక్ష్మి, కానిస్టేబుల్ గఫార్ బాషా, నాగరాజు, సుబ్బు, రాజేష్, పద్మావతి పాల్గొన్నారు.


