కొత్తపల్లి: ఎర్రమఠం గ్రామానికి చెందిన ఎలకంటి చిన్న ఓబులేసు ఫిర్యాదు మేరకు నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై డీఎస్పీ రామాంజీనాయక్ విచారణ చేపట్టారు. ఈనెల 23 వ తేదిన పొలం విషయంలో చిన్న ఓబులేసుపై పాతమాడుగుల గ్రామానికి చెందిన పెద్దవెంకట స్వామి, చిన్న వెంకట స్వామి, రాజులు కర్రలతో దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పై ముగురిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు కావడంతో ఆదివారం ఆత్మకూరు రూరల్ సీఐ సరేష్‌కుమార్ రెడ్డి, ఎస్‌ఐ జయశేఖర్‌తో కలిసి ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ పాతమాడుగుల గ్రామంలో విచారణ చేపట్టారు. స్వయంగా ఆయన సమస్యాత్మక పొలాన్ని పరిశీలిచారు. చుట్టపక్కల రైతులను, గ్రామస్తులను విచారించారు.
కోడి పందేల నిర్వాహకుల అరెస్టు
ప్యాపిలి: పోతుదొడ్డి గ్రామంలో కోడి పందేల నిర్వాహకులను ప్యాపిలి ఎస్‌ఐ నాగార్జున ఆదివారం అరెస్టు చేశారు. గ్రామానికి చెందిన పెనుగొండ రవికుమార్, మునుగుల రామాంజనేయులు, నాగప్ప, రామకృష్ణ తదితరులు గ్రామ శివారు ప్రాంతంలో కోడి పందేలు నిర్వహిస్తుండటంతో అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితుల నుంచి 8 బైక్‌లు, 4 కోడి కత్తులు, 3 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో ఐదుగురి కోసం గాలిస్తున్నామని తెలిపారు.
గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి
అవుకు(కొలిమిగుండ్ల): పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు ముఖేష్ (36) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. గతంలో అవుకు మోడల్ స్కూల్‌లో ఏడేళ్ల పాటు ఇంగ్లిష్ పీజీటీగా పనిచేసిన ఆయన, రెండేళ్ల క్రితం బదిలీపై వెలుగోడు మోడల్ స్కూల్‌కు వెళ్లారు. ప్రస్తుతం ఆయన కుటుంబంతో కలిసి నంద్యాలలో నివసిస్తున్నారు. ముఖేష్ భార్య స్వర్ణరేఖ ఉప్పులపాడు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ముఖేష్ తండ్రి వెంకట కృష్ణయ్య కూడా ఏడాదిన్నర క్రితం ఆకుమల్లలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ గుండెపోటుతోనే మరణించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
పెద్దకడబూరు: నౌలేకల్లు గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్‌ఐ ఈ మారుతి తెలిపిన వివరాల మేరకు.. పెద్దకడబూరు మండల కేంద్రానికి చెందిన బోయ ఆంజనేయ కుమారుడు నందవరం తిక్కన్న (42) ఆదివారం తమ బంధువుల పెళ్లి సంబంధం చూసేందుకు కోసిగి వెళ్లారు. కార్యక్రమం అనంతరం బైక్‌పై తిరిగి వస్తుండగా నౌలేకల్లు గ్రామ సమీపంలో బొలెరో వాహనం ఢీకొంది. ఎమ్మిగనూరు సంతలో ఎద్దులను కొనుగోలు చేసిన కౌతాళం మండలం కుప్పగళ్లు గ్రామానికి చెందిన రైతులు బొలెరో తీసుకొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తిక్కన్న తీవ్రంగా గాయ పడంతో పెద్దతుంబళం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మృతునికి ముగ్గురు ఆడ పిల్లలు, భార్య ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


