● డీజిల్ లేక నిలిచిపోయిన ట్రాక్టర్లు
● కార్మికుల ఉపాధిపై ప్రభావం
కొలిమిగుండ్ల: డీజిల్ సరఫరాలో జాప్యంతో నాపరాతి పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడుతుంది. నియోకవర్గంలో కొలిమిగుండ్ల, అవుకు, బనగానపల్లె మండలాల్లో వ్యవసాయం తర్వాత నాపరాతి గనులపై ఆధారపడిన కార్మికులు వేలాది మంది ఉన్నారు. నాపరాతి గనుల్లో వెలికితీసిన రాళ్లను ఎక్కువ భాగం ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తుంటారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా డీజిల్ సమస్య వేధిస్తుండటంతో యజమానులు ట్రాక్టర్లను ఇళ్ల వద్దనే ఖాళీగా పెట్టుకోవాల్సి వస్తుంది. కొలిమిగుండ్ల మండలంలోనే 600కు పైగానే ట్రాక్టర్లు ఉన్నాయి. డీజిల్ లభించక పోవడంతో పదుల సంఖ్యలో ట్రాక్టర్లు రోడ్డెక్కడం లేదు. బంక్‌లకు డీజిల్ ఎప్పుడు వస్తోందో తెలియని పరిస్థితి నెలకొంది. వచ్చినా క్షణాల్లో వాహనాలు బారులు దీరుతున్నాయి. నాపరాతి గనుల్లో పనులు చేసేందుకు డీజిల్‌తో నడిచే కోత మిషన్‌లను ఉపయోగిస్తున్నారు. డీజిల్ లేక గనులు బంద్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని యజమానులు వాపోతున్నారు. గనుల్లో పని చేసే కార్మికులతో పాటు ట్రాక్టర్ డ్రైవర్లు, లోడింగ్, అన్‌లోడింగ్ కార్మికుల ఉపాధి లేక ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ప్రధాన రహదారిపై పదుల సంఖ్యలో ట్రాక్టర్‌లు రవాణ సాగిస్తుండేవి. డీజిల్ కొరత వల్ల ఎక్కడక్కడ నిలిచిపోయాయి. మరి కొన్ని రోజులు ఇదే పరిస్థితి నెలకొంటే కార్మికుల పరిస్థితి దయనీయంగా మారుతుంది. సొంత కార్లు ఉన్న యజమానులకు డీజిల్ లేక ప్రత్యామ్నాయ మార్గాల్లో రాక పోకలు సాగిస్తున్నారు. డీజిల్ సమస్యను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ప్రజలు ఆరోపిస్తున్నారు.


