కర్నూలు(హాస్పిటల్): శస్త్రచికిత్సల సమయంలో అనెస్తీషియా వైద్యులు అందించే సేవలు కీలకమని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు చెప్పారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల అనెస్తీషియా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం ఆసుపత్రిలోని మోర్టాన్ సెమినార్ హాలులో ‘మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్’ అనే అంశంపై జోనల్ సీఎంఈ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ వెంకటేశ్వర్లు కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలన్నీ అనెస్తీషియా విభాగంపై ఆధారపడి ఉంటాయన్నారు. నొప్పుల నివారణకు అనెస్తీషియా వైద్యులు ప్రత్యేకంగా క్లినిక్‌లు ఏర్పాటు చేసిన ఆధునిక వైద్యసేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ అబ్జర్వర్, పీడియాట్రిక్ సర్జరీ హెచ్‌ఓడీ డాక్టర్ శివకుమార్ మాట్లాడారు. అనంతరం తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ గురించిన పలు అంశాలపై నిపుణులైన వైద్యులు సైన్స్ సెషన్స్ ద్వారా వివరించారు. జోనల్ సీఎంఈ కో–ఆర్డినేటర్, పాథాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ బాలీశ్వరి, అనెస్తీషియా విభాగాధిపతి డాక్టర్ సుధీర్‌కుమార్, డాక్టర్ విశాల, డాక్టర్ రామశివనాయక్, నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాల అనెస్తీషియా హెచ్‌ఓడీ డాక్టర్ క్రిష్టఫర్ తదితరులు పాల్గొన్నారు.


