కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి ఉగ్రరూపానికి బయట తిరిగేందుకు జనం బెంబేలెత్తిపోతున్నారు. తీవ్రమైన ఉష్ణోగ్రతలతో పాటు వేడి గాలులు వీస్తున్నాయి. శనివారం జిల్లాలోని చిప్పగిరి మండలం నగరడోన గ్రామంలో 44.8 డిగ్రీలు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎండలో బయటకు వెళితే తప్పక టోపీలు ధరించాలన్నారు. చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, మంచి నీరు అధికంగా తీసుకోవాలని సూచించారు.
రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో కూడా అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ప్రశాంతంగా పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష
కర్నూలు సిటీ: పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా జరిగింది. పరీక్ష నిర్వహణకు కర్నూలులో 8, ఆదోని నందు 5, మంత్రాలయం 1, పత్తికొండ 3, ఎమ్మిగనూరులో 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 7735 మంది విద్యార్థులకుగాను 7202 మంది హాజరుకాగా 533 మంది గైర్హాజరయ్యారు.
ఎస్పీతో సివిల్ జడ్జి
మర్యాదపూర్వక భేటీ
కర్నూలు: ఇటీవల వెలువడిన ఆంధ్రప్రదేశ్ జుడీషియల్ సర్వీసెస్ ఫలితాల్లో జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే)గా ఎంపికై న బి.తాండ్రపాడు గ్రామానికి చెందిన మహమ్మద్ అజామ్ శనివారం ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహమ్మద్ అజామ్‌ను ఎస్పీ అభినందిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కృషి, పట్టుదలతో సాధించిన ఈ విజయాన్ని ప్రశంసిస్తూ న్యాయ వ్యవస్థలో ప్రజలకు న్యాయం అందించే దిశగా సేవలు అందించాలని సూచించారు. తండ్రి అల్లాబకాష్ హెడ్ కానిస్టేబుల్‌గా సేవలందిస్తుండగా కుమారుడు న్యాయ వ్యవస్థలో ప్రతిష్టాత్మక స్థానం పొందడం గర్వకారణమని ఎస్పీ కొనియాడారు.
28 నుంచి ఖాదర్‌లింగస్వామి ఉరుసు
● మే2 వరకు నిర్వహణ
కౌతాళం: మతసామరస్యానికి ప్రతీకగా వెలసిన జగద్గురు ఖాదర్‌లింగ స్వామి ఉరుసు కౌతాళంలో ఈనెల 28నుంచి ప్రారంభమై మే 2వ తేదీ వరకు జరగనుంది. శనివారం వివిధ దర్గాల పీఠాధిపతులతో కలిసి ఉరుసు పోస్టర్లను దర్గా ధర్మకర్త సయ్యద్ మున్నపాషా చీష్తీ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. 28న మంగళవారం స్వామి సమాధిని సుగంధ, అత్తర్ పానియాలతో (గుసుల్) శుభ్రచేస్తారని,, 29న బుధవారం గంధం, 30న గురువారం ఉరుసు ఉంటుందని తెలిపారు. ఉత్సవాలకు ఇప్పటికే దర్గా పరిసరాల్లో షామియాలను ఏర్పాటు చేశారు. దర్గాను పూర్తిగా విద్యుత్ దీపాలతో అలంకరించారు.


