మధుర ఫలం.. ప్రియం | - | Sakshi
Sakshi News home page

మధుర ఫలం.. ప్రియం

Apr 26 2026 2:15 AM | Updated on Apr 26 2026 2:15 AM

దిగుబడి బాగా తగ్గింది

సైజ్‌ బట్టి ధరలు

నిరాశపరిచిన బంగినపల్లి దిగుబడులు

గతేడాది కంటే పెరిగిన ధరలు

వంద పండ్లు రూ. 5 వేలు పైమాటే!

బనగానపల్లె: వేసవి వచ్చిందంటే మార్కెట్‌లో ఫలరాజు మామిడి పండ్లు కళకళలాడుతాయి. మామిడి పండ్లలో బంగినపల్లి బేనిషాన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఏడాది బంగినపల్లి తినాలంటే సామాన్యులు జేబులు తడమాల్సిన పరిస్థితి ఏర్పడింది. దిగుబడులు తగ్గడంతో ధరలు ఆకాశాన్ని తాకాయి. బేనిషాన్‌ మామిడి తోటలు జిల్లా వ్యాప్తంగా సుమారు 10 వేల ఎకరాల్లో విస్తరించాయి. ఏటా సగటున 51.896 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుంది. ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించకపోవడంతో దిగుబడి పూర్తిగా తగ్గినట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో బనగానపల్లె ప్రాంతంలో 650 ఎకరాల్లో, డోన్‌ 2,439, వెల్దుర్తి 892 బేతంచర్ల 587, ప్యాపిలి 805, కల్లూరు 496, ఓర్వకల్లు 1122, కోడుమూరు 238, వెలుగోడు 214, రుద్రవరం 215 ఎకరాలతో పాటు తదితర ప్రాంతాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఈ ఏడాది ప్రధానంగా రైతులు యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం, మిరప పంటను ఆశించే తేనే మంచుపురుగు మామిడి చెట్లకు పట్టడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. 15–20 రోజుల ముందే పూత రావడం, వేసవి తాపంతో అధికంగా రాలిపోవడం, ఈ క్రమంలో కొందరు రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టడంలో విఫలం కావడంతో పూత నిల్వలేదు. దీంతో దిగుబడి తగ్గిపోయింది. ఈ క్రమంలో మార్కెట్‌లో ధరలు ఆకాశాన్నంటాయి. పది రోజులుగా బేనిషాన్‌ మామిడి పండ్లు మార్కెట్‌లో కనిపిస్తున్నాయి. వ్యాపారులు కిలో వంద రూపాయలకు, వంద పండ్లు రూ 5 వేల నుంచి 6 వేలకు విక్రయిస్తున్నారు. గతేడాది ఇదే సైజ్‌ పండ్లు వంద రూ.3 వేల నుంచి 4 వేలకు లభించాయి. ఈ ఏడాది బంగినపల్లె ప్రియం కావడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

నవాబులు పాలనలో విస్తరించిన తోటలు

బనగానపల్లె ప్రాంతంలో సుమారు 120 ఏళ్ల క్రితం బంగినపల్లి బేనిషాన్‌ మామిడితోటల పెంపకానికి అప్పటి నవాబులు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. మామిడి పండ్లలో బేనిషాన్‌ రకాన్ని రాజుగా, మలుగువ మంత్రిగా, దిన్‌పసన్‌ సేనానిగా పిలిచేవారు. పేర్లను బట్టి బంగిపల్లి మామిడికి ఎంత ప్రాముఖ్యత ఉందో చెప్పవచ్చు. ఇక్కడి భూములు అనుకూలంగా ఉండడంతో మామిడితోటల సాగుకు నవాబులు ప్రత్యేకంగా బావులు తవ్వించి తోటలను విస్తరించారు. బేనిషాన్‌ మామిడి పండు కాంతివంతంగా కనిపిస్తూ రుచి అద్భుతంగా ఉంటుంది. మాగిన తరువాత పది రోజుల పాటు నిల్వ ఉన్నా చెడిపోదు. వినియోగదారులు ఈ రకాన్ని అధికంగా కొనుగోలు చేస్తారు. ఈ ప్రాంతవాసులు వేసవి కాలంలో ఇక్కడ లభించే బంగినపల్లి రకం మామిడిని తమ బంధువులు, స్నేహితులు ఎక్కడ ఉన్నా ఏటా పంపుతూ అభిమానాన్ని చాటుకుంటారు.

మాకు 30 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఈ సంవత్సరం తేనే మంచుపురుగు ఆశించడంతో పాటు వేసవితాపం ఎక్కువ కావడంతో పూత రాలిపోయి దిగుబడి పూర్తిగా తగ్గింది. ఈ పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. దిగుబడి తక్కువగా ఉండటంతో మార్కెట్‌లో ధరలు పెరుగుతాయి.

– అబ్దుల్‌హమిద్‌ మామిడితోట యజమాని

ఈ సంవత్సరం మామిడిపండ్ల దిగుబడి తగ్గి ధరలు చుక్కలంటుతున్నాయి. ఈ విధంగా దిగుబడులు తగ్గడం ఐదేళ్లలో ఇదే ప్రథమం. దిగుబడి తగ్గడం వల్ల సైజును బట్టి కిలో వంద వరకు ధర ఉంది. వంద మామిడి పండ్లు 4 – 5 వేల వరకు విక్రయిస్తున్నాం.

– ఖాజాహుస్సేన్‌ మామిపండ్ల వ్యాపారి

Advertisement
 
Advertisement
Advertisement