కృష్ణగిరి: మండల పరిధిలోని ఎరుకుల చెరువు గ్రామంలో గౌండ పని చేస్తూ కరెంట్ షాక్‌కు గురై వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామానికి చెందిన మనుగొండ రాజమోహన్(44)మృతి చెందాడు. ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాల మేరకు.. రాజమోహన్ తన చిన్నాన్న కుమారుడితో కలిసి ఎరుకుల చెరువులోని సూర్యనారాయణ ఇంటి గౌండ పనికి వెళ్లాడు. ప్లాస్టింగ్ పని ముగించుకుని ప్లాసింగ్ చేసేందుకు వేసుకున్న సారువ కట్టెలపై నుంచి దిగే సమయంలో జారి కరెంట్ తీగలకు తగిలాడు. దీంతో షాక్‌కు గురై కింద పడ్డాడు. వెంటనే క్షతగాత్రుడిని వెల్దుర్తి సీహెచ్‌సీకి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య సుజాత, కుమారుడు సుమంత్ ఉన్నారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
నందికొట్కూరు రూరల్: బ్రాహ్మణకొట్కూరు గ్రామంలో ఏబీఎం చర్చి వద్ద శనివారం ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. బ్రాహ్మణకొట్కూరు ఎస్‌ఐ మణికంఠ తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు నుంచి నందికొట్కూరుకు వెళ్తున్న నందికొట్కూరు ఆర్టీసీ డిపో అద్దె బస్సును బ్రహ్మణకొట్కూరు ఏబీఎం చర్చి వద్ద కొత్తపల్లి మండలం శివపురం గ్రామానికి చెందిన సయ్యద్ యూసుఫ్ (63) ఎక్కుతున్నాడు. ఆ సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును ముందుకు కదిలించడంతో యూసుఫ్ కింద పడ్డాడు. అతనిపై బస్సు వెనుక టైర్ ఎక్కడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు. యూసూఫ్ పని నిమిత్తం బ్రాహ్మణకొట్కూరు వచ్చినట్లు సమాచారం.
మద్యం దుకాణాల్లో విస్తృత తనిఖీలు
కర్నూలు: మద్యం దుకాణాలు, బార్లలో ధరల ఉల్లంఘన, కల్తీ నివారణ కోసం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు నగరంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆ శాఖ కమిషనర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ఉత్తర్వుల మేరకు కర్నూలు ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, జిల్లా అధికారి ఎం.సుధీర్ బాబు బృందాలుగా ఏర్పడి శనివారం బార్లు, మద్యం దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. మద్యం నాణ్యతను పరిశీలించి మద్యం బాటిళ్ల స్కానింగ్‌ను నిశితంగా పరిశీలించారు. ప్రతి బాటిల్‌ను సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేయాలని, ఖచ్చితంగా సమయపాలన పాటించాలని దుకాణ నిర్వాహకులకు సూచించారు. కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో మొత్తం 51 మద్యం దుకాణాలు, బార్లు ఉన్నాయి. ఇప్పటివరకు సుమారుగా 38 దుకాణాలను తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు.


