● 30 కిలోల వెండి పట్టీలు స్వాధీనం
● మధ్యప్రదేశ్ వెళ్లి దొంగలను
పట్టుకొచ్చిన డోన్ పోలీసులు
డోన్ రూరల్: వారం రోజుల్లో డోన్ పోలీసులు భారీ చోరీ కేసు మిస్టరీని ఛేదించి నిందితులను అరెస్ట్ చేసి కటకటాలకు పంపారు. మధ్యప్రదేళ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.66.62 లక్షల విలువైన 30.200 కిలోల వెండి పట్టీలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం డీఎస్పీ శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో దొంగల వివరాలను వెల్లడించారు. ఈ నెల 18వ తేదీన తెల్లవారుజామున డోన్ మండలంలోని యు.కొత్తపల్లి వద్ద ఉన్న న్యూ భారత్ డాబా వద్ద మధురై నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఆగింది. ఆ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న మువాజ్ ఖాన్‌కు చెందిన వెండి పట్టీలు ఉన్న బ్యాగ్ అపహరణకు గురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లాకు చెందిన చోటు దవార్(20), రాజేశ్ చోహన్ (32), మన్సూర్ ఖాన్(32) చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. డోన్ టౌన్ సీఐ ఇంతియాజ్ బాషా, ఎస్‌ఐలు శరత్ కుమార్, నరేంద్ర కుమార్, సీసీఎస్ సీఐ సురేష్ కుమార్, బృందం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ధర్మపురి ప్రాంతానికి వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులు ఏపీ, తెల్లంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పలు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. చాకచక్యంగా కేసును ఛేదించిన సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.


