● యువకుడి ప్రాణాలు కాపాడిన
టూటౌన్ సీఐ
ఆదోని అర్బన్: పట్టణంలోని మర్చంట్స్ క్లబ్ పక్కనే ఉన్న ఆలిండియా రేడియో టవర్ ఎక్కి శనివారం చిప్పగిరి మండలం సంగాల గ్రామానికి చెందిన యువకుడు సురేంద్ర హల్‌చల్ చేశారు. సీఐ రాజశేఖర్‌రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి ఆ యువకుడిని కిందకు వచ్చేలా చేసి ప్రాణాలు కాపాడారు. వివరాలు.. నేమకల్ గ్రామానికి చెందిన నాగేశ్వరిని ప్రేమించి సురేంద్ర పెళ్లి చేసుకున్నాడు. మద్యం మత్తులో భార్యను కొట్టడంతో ఆమె సహించలేక పుట్టింటికి వెళ్లారు. భార్యను పిలిచినా రాకపోవడంతో శనివారం ఆదోని పట్టణంలోని ఆల్ ఇండియా రేడియో టవర్ పైకి ఎక్కాడు. నా భార్య వస్తేనే దిగుతా.. లేదంటే దూకేస్తానంటూ కేకలు వేయడంతో స్థానికులకు భయబ్రాంతులు గురయ్యారు. విషయం తెలుసుకున్న టూటౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ రామనాథ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ యువకుడైన సురేంద్ర ఫోన్ నంబర్‌ను తెలుసుకుని సీఐ రాజశేఖర్‌రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి ధైర్యం చెప్పి నీవు కిందకు దిగితే నీ భార్య నాగేశ్వరితో మాట్లాడిస్తాను అని చెప్పారు. సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో సురేంద్ర వెంటనే టవర్‌పై నుంచి కిందకు దిగొచ్చాడు. దాదాపు 2 గంటల వరకు టవర్‌పైనే ఉండడంతో సీఐ రాజశేఖర్‌రెడ్డి సురేంద్రకు తాగేందుకు నీరు ఇచ్చి, స్టేషన్‌కు తీసుకెళ్లారు. నాగేశ్వరి, వారి తల్లిదండ్రులను ఆలూరు పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సీఐ తెలిపారు.


